గాయని వసుంధర దాస్‌కు చేదు అనుభవం.. కారులో ఆమెను.. దారుణంగా
దక్షిణాది గాయని, నటి, వ్యాపారవేత్త వసుంధరా దాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తెల్లవారు జామున బెంగళూరులోని ప్రధాన రహదారిపై ఓ క్యాబ్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసుంధర దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో 4 కిలో మీటర్ల మేర
పోలీసుల కథనం ప్రకారం.. వసుంధర దాస్‌ను క్యాబ్ డ్రైవర్ సుమారు 4 కిలో మీటర్ల మేర వెంటాడాడు. రెండుసార్లు ఆమె వాహనానికి కారు అడ్డం పెట్టారు. సోమవారం తెల్లవారు జామున 4.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్డులోని 13వ క్రాస్ వద్ద డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు అని తెలిపారు.

పోలీసులకు వసుంధర ఫిర్యాదు
పోలీసులకు వసుంధరా దాస్ చెప్పిన ప్రకారం.. KA-05 AE-3933 రిజిస్ట్రేషన్‌తో గల నంబర్ వాహనం తనను వెంటాడింది. భాష్యం సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో నా కారు ఆగింది. నా పక్కనే మరో కారు ఆగింది. గ్రీన్ లైట్ పడగానే నేను స్ట్రయిట్‌గా కారును ముందుకు పోనిచ్చాను. ఆ సమయంలో మరో కారు నా వాహనానికి అడ్డుగా నిలిచింది అని తెలిపారు.

క్యాబ్ డ్రైవర్ అనుచితంగా
తన కారుకు అడ్డుపడ్డారనే కారణంతో క్యాబ్ డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడు. నాతో గొడవపడటానికి సిద్ధపడ్డారు. చీకటిగా ఉండటంతో నేను నా వాహనంలో ముందుకెళ్లాను. దాంతో నా కారుతో వెంటాడాడు. దారుణంగా తిడుతూ నన్ను దుర్భాషలాడాడు. నాకు భయమేసి స్పీడ్‌గా వెళ్లిపోయాను అని వసుంధర దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు
క్యాబ్ డ్రైవర్ తనను వెంటాడిన ఘటనలో కేసు నమోదు చేసింది నిజమే. అధికారులకు వాహనం వివరాలు అందజేశాను. ఐపీసీ 509, 341, 354, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అచూకీ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు అని మీడియాతో వసుంధరరాజ్ అన్నారు.

వసుంధర బహుముఖ ప్రజ్ఞాశాలి
వసుంధర దాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయనిగా, నటిగా, సినీ గేయ రచయితగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితులు. ఒకే ఒక్కడులో షకలక బేబి పాటతో కుర్రకారును ఉర్రూతలూగించారు. కమల్ హాసన్ నటించిన హేరామ్ చిత్రంతో నటిగా మారారు. బాలీవుడ్‌లో మాన్‌సూన్ వెడ్డింగ్ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బెంగళూరులో ది యాక్టివ్ అనే మ్యూజిక్ కంపెనీని నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











