పేదలు ఆకలితో చస్తుంటే విలాసవంతమైన పెళ్లా? నిఖిల్ వివాహంపై మండిపడ్డ రవీనా
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు, సినీ నటుడు, రాజకీయ నేత నిఖిల్ కుమారస్వామి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలను లెక్క చేయకుండా సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నట్టు పేర్కొంటూ జరిగిన ఈ వివాహంపై పలువురు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కుమారస్వామి కుటుంబానికి ఏ మాత్రం లెక్కలేదని బాలీవుడ్ నటి రవీనా టాండన్ మండిపడ్డారు. ఈ వివాహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.

వివాదాల మధ్య నిఖిల్ వివాహం
నిఖిల్ కుమారస్వామి వివాహం రేవతితో శుక్రవారం అంటే ఏప్రిల్ 17వ తేదీన అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. కుటుంబంలోని అతి సన్నిహితులైన వారే హాజరయ్యారని మీడియా వర్గాలు వెల్లడించాయి. దాదాపు 80 మంది వరకు హాజరు కావొచ్చనే రిపోర్టు మీడియాలో వెలువడింది. అయితే లాక్‌డౌన్ సమయంలో వివాహ వేడుకను నిర్వహించడంపై పలు వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

లాక్‌డౌన్‌తో నిరాడంబరంగా
వాస్తవానికి నిఖిల్ వివాహాన్ని నభూతో నభవిష్యత్ కార్యక్రమంగా నిర్వహించాలని మాజీ సీఎం కుమారస్వామి ప్లాన్ చేశారు. తన సొంత జిల్లా, తమ రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువ మద్దతు లభించే రామనగరలోని తమ ఫామ్‌హౌజ్‌లో నిర్వహించాలని, ఆ పెళ్లికి జిల్లాలోని ప్రతీ ఒక్కరిని వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. అయితే కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పెళ్లి నిరాడంబరంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మండిపడిన రవీనా టాండన్
నిఖిల్ కుమారస్వామి పెళ్లిపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్పందిస్తూ.. దేశంలోని చాలామంది పేదలు తమ కుటుంబాలను చేరుకోలేకపోతున్నారనే విషయం ఈ ఆత్మాభిమానం లేని వాళ్లకు తెలియదనుకొంటా. చాలా మంది ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. ఈ సంక్షోభంలో మిగితా వారు పేదలకు ఏదో ఒకరూపంలో సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. బఫెట్‌లో ఎలాంటి ఆహారం వడ్డిస్తున్నారేది చర్చగా మారింది అని రవీనా టాండన్ మండిపడ్డారు.
Recommended Video

కేజీఎఫ్2లో రవీనా టాండన్
రెండు దశాబ్దాల క్రితమే కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ తాజాగా మరోసారి శాండల్‌వుడ్‌లో ప్రవేశించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో ఆమె కీలక పాత్రను పోషించారు. ఈ పాత్ర నెగిటివ్ షేడ్‌లో ఉంటుందని ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











