వార్ 2 మూవీకి షాకిచ్చిన ఐమాక్స్.. కూలీ హై డిమాండ్‌తో అలాంటి పరిస్థితి!
ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అన్ని ప్రాంతాల్లో కూలీ చిత్రం ప్రభంజనాన్ని కనబరుస్తున్నది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోకూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు దేశంలోని పలు భాషల్లో ఎనలేని ఆదరణ కనిపిస్తున్నది. ఈ సినిమాకు కర్ణాటకలో కనిపిస్తున్న స్పందన చూస్తుంటే.. భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకం కలుగుతున్నది. అయితే వార్ 2 కంటే రజనీకాంత్ సినిమాకు ఎక్కువగా రెస్పాన్స్ ఉండటంతో ముందస్తు అగ్రిమెంట్లను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది అని థియేటర్ యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. కన్నడ రాష్ట్రంలో ఓ రకమైన పరిస్థితి గురించిన వివరాల్లోకి వెళితే..
దేశంలోనే అగ్ర సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై వార్ 2 చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. తొలిసారి హిందీ చిత్ర సీమలో అడుగుపెట్టి ఎన్టీఆర్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపేందుకు రెడీ అవుతున్నారు. అయితే వార్ 2 సినిమా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముందే అనేక ఒప్పందాలు చేసుకొన్నది.

వార్ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ వెర్షన్ థియేటర్లతో ముందస్తు ఒప్పందాన్ని వార్ 2 చిత్ర యూనిట్ కుదుర్చుకొన్నది. అయితే కూలీ సినిమాను ఐమాక్స్‌లో ప్రదర్శించడానికి వీలు లేకుండా పోయింది. అయితే కూలీ సినిమాకు అనూహ్యమైన డిమాండ్ ప్రేక్షకుల నుంచి వస్తుండటంతో ముందస్తు ఒప్పందాన్ని పలు ప్రాంతాల్లో పక్కన పెట్టి.. రజనీ సినిమాకు ఐమాక్స్ థియేటర్లు స్క్రీనింగ్‌కు ఇస్తున్నట్టు సమాచారం.
అయితే కన్నడ రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు నగరంలో కూలీ సినిమాకు సంచలన రీతిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతూ.. ఎక్కువ థియేటర్ల కోసం డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. దాంతో వార్ 2 సినిమాకు ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నగరంలోని ఐమాక్స్ థియేటర్‌లో కూలీ సినిమాను ప్రదర్శించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది అని తెలిసింది.
ముందస్తు ఒప్పందం ప్రకారం వాస్తవానికి వార్ 2 సినిమాను ఐమాక్స్ థియేటర్‌లోనే పూర్తిగా ప్రదర్శించాలి. కానీ కూలీకి ఎక్కువ డిమాండ్ ఉండటంతో 2 షోలు వార్ 2 సినిమాకు, 1 షో కూలీ మూవీకి ఇవ్వాలని డిస్టిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యం మధ్య ఒప్పందం జరిగింది అని తెలిసింది. దాంతో కూలీకి ఐమాక్స్ థియేటర్‌లో చోటు లభించడంతో తలైవా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
ఇక బెంగళూరులో వార్ సినిమా కంటే.. కూలీ సినిమాకే ఎక్కువ స్క్రీన్లు కేటాయించడం జరిగింది. తొలుత వార్ 2 సినిమాను 210 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే చివరికి 165 స్క్రీన్లకే పరిమితం చేశారు. ఇక కూలీ సినిమాకు మొత్తంగా 240 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు తొలుత ఏర్పాట్లు జరిగాయి. ఆ తర్వాత డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం 290 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు నిర్ణయం తీసుకొన్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











