బిగ్‌బాస్‌లో బయటపడ్డ లొసుగు.. హౌస్ లోపలే నటిపై లైంగిక వేధింపులు!
ఇండియాలో బిగ్ బాస్ షో ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. క్రమంగా ఈ షోపై అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఈ షోలో పాల్గొనే మహిళా కంటెస్టెంట్స్ కు ఇబ్బంది కలిగించేలా, ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ చూడలేని విధంగా తయారవుతోందంటూ విమర్శలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్ లో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న నటి కవితనే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిందంటే ఇందులో లొసుగులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది.

లైంగిక వేధింపులు
కన్నడ బిగ్ బాస్ పాల్గొన్న నటి కవిత గౌడ హౌస్ నుంచి బయటకువచ్చిన తర్వాత నేరుగా మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ నిర్వహణ సరిగా లేదని, మహిళపై లైంగిక దాడులు, వేధింపులు ఎదురవుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

అసభ్యంగా
ఓ టాస్క్ లో భాగంగా జరిగిన పోటీలో కవిత కూడా పాల్గొంది. ఈ పోటీలో మరో కంటెస్టెంట్ యాండీ కూడా ఉన్నాడు. టాస్క్ జరుగుతున్న సమయంలో యాండీ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, ఉద్దేశపూర్వకంగానే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కవిత ఆరోపించింది. రెండు రోజుల పాటు సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ టాస్కే జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా యాండీ తనని లైంగికంగా వేధించినట్లు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా
హౌస్ లో ఉన్న సమయంలో ఈ విషయం గురించి తాను బిగ్ బాస్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు కవిత పేర్కొంది. అయినా కూడా వాళ్ళు చర్యలు చేపట్టలేదు. అందువలనే తాను మహిళా కమిషన్ ని ఆశ్రయించినట్లు కవిత వివరించింది. దీనితో మహిళా కమిషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.ముందుగా నిర్వాహకులని ఈ ఘటనపై వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాకేం తెలియదు
కవిత తనపై ఫిర్యాదు చేయడంపై యాండీ స్పందించాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఆమెని కలవలేదు. హౌస్ లో నిబంధనల ప్రకారమే టాస్క్ లో పెర్ఫామ్ చేశాం. బహుశా కవిత ఓటమి భరించలేక నాపై నిందలు వేస్తోందేమో అని యాండీ తెలిపాడు. న్యాయ పరంగా తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధం అని యాండీ తెలిపాడు.


Click it and Unblock the Notifications











