Rockline Venkatesh: రవితేజ నిర్మాత ఫ్యామిలీలో దారుణం.. తలుపులు పగలగొట్టి మరీ!
దక్షిణ భారతదేశంలోని పలు సినిమా ఇండస్ట్రీల్లో సుదీర్ఘ కాలంగా డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్స్ అధినేత రాక్‌లైన్ వెంకటేష్ కుటుంబంలో దారుణం జరిగింది. ఆయన సోదరుడు బ్రమరేష్ (58) బెంగళూరులో నివాసం ఉంటోన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో భారీగా నగలు, నగదును చోరీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.
రాక్‌లైన్ వెంకటేష్ సోదరుడు బ్రమరేష్ తన కుటుంబ సభ్యులతో సహా విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇంటికి చేరుకున్న తర్వాత చోరీ జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు, సీక్రెట్ లాకర్లను పరిశీలించగా.. అందులో పెట్టిన రూ. 3 కోట్ల విలువైన 5.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు మాయమైనట్లు తేల్చారు. దీంతో వెంటనే బ్రమరేష్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణను ప్రారంభించారు.

బ్రమరేష్ ఇంట్లో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించిన వివరాలను పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. 'తమ ఇంట్లో చోరీ జరిగినట్లు బ్రమరేష్ మాకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఫిర్యాదు సేకరించిన తర్వాత విచారణ ప్రారంభించాము. ఇప్పటికే వేలిముద్రల విభాగం, ఇతర సాంకేతిక విభాగాలు ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశాము' అని ఆయన తెలిపారు.
ఈ చోరీ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్రపై మరో పోలీసు అధికారి స్పందించారు. 'ఇంటి పై అంతస్తు నుంచి తలుపులు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. సెక్యూరిటీ గార్డు కూడా ఈ దొంగతనాన్ని గమనించలేకపోయాడు. బ్రమరేష్ కుటుంబ సభ్యులు పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఈ విషయం బయటకు వచ్చింది. సెక్యూరిటీ గార్డుకు కూడా అప్పుడే ఇది తెలిసింది. అయినప్పటికీ అతడిని తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాము' అని వివరించారు.
ఇదిలా ఉండగా.. రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్నో చిన్న, భారీ సినిమాలను నిర్మించారు. అలాగే, పెద్ద పెద్ద చిత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్‌జాన్' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే, రజినీకాంత్‌తో 'లింగా' వంటి సినిమాను కూడా నిర్మించారు. అంతేకాదు, రాక్‌లైన్ వెంకటేష్ తెలుగులో రవితేజతో 'పవర్' మూవీని నిర్మించారు.


Click it and Unblock the Notifications











