కరోనా ఎఫెక్ట్.. మాజీ సీఎం కుమారుడి పెళ్లి వాయిదా?
ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ ప్రభావం పెళ్లిళ్లపై భారీగా పడుతున్నది. దేశవ్యాప్తంగా పలు వివాహాలు కరోనా ఎఫెక్ట్‌తో రద్దు అవుతున్నాయి. అయితే ప్రధానంగా సెలబ్రిటీల పెళ్లి రద్దు చేయాల్సిన పరిస్థితులు రావడంతో భారీగా నష్టం, ఖర్చు వాటిల్లుతుందనే వాదన వినిపిస్తున్నది. టాలీవుడ్‌లో ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్లి రద్దయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక కన్నడలో మాజీ సీఎం కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ గౌడ పెళ్లి కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నది.

హీరో నిఖిల్ వివాహం రేవతితో జరుగాల్సి ఉంది. ముందస్తుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం మే 18 తేదీన వివాహం జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమయ్యాయి. బెంగళూరుకు సమీపంలోని జానపద లోక ప్రాంతంలో వివాహ వేదిక కోసం ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. అంతలోనే కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ఈ పెళ్లిని రద్దు చేయాలనే ఆలోచనలో కుమారస్వామి ఉన్నట్టు తెలుస్తున్నది.

జనపద లోక వద్ద పెళ్లి పనులను ఆపివేయడంతో నిఖిల్ గౌడ పెళ్లిని క్యాన్సిల్ చేశారనే వార్తలు ఊపందుకొన్నాయి. భారీ ఎత్తున వీవీఐపీలు, వీఐపీలు వచ్చే అవకాశం ఉండటం, కర్ణాటకలో కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేయడానికే మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











