బీజేపీలో చేరనున్న స్టార్ హీరో.. అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేందుకు ప్లాన్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకొంటున్నాయి. అన్ని పార్టీలు కొత్త నాయకులను చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే పలు పార్టీలు సినీ తారలకు గాలం వేసి వారిని పార్టీలో చేర్చుకొనేందుకు రెడీ అవుతున్నాయి. ఒకప్పటి కన్నడ స్టార్ హీరో అనంత్ నాగ్ ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.
వాస్తవానికి ఫిబ్రవరి 22వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నలీన్ కుమార్ కతీల్ సమక్షంలో అనంతనాగ్ చేరాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల అనంత్ నాగ్ పార్టీలో చేరే కార్యక్రమం రద్దైంది. అయితే వచ్చే వారం పార్టీ అధినేతల సమక్షంలో అనంత్ నాగ్ పార్టీలో చేరుతారని బీజేపీ ప్రతినిధులు వెల్లడించిన సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు బీజేపీ అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ క్రమంలో సినీ నటులను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంత్ నాగ్‌ను పార్టీలో చేరాలని బీజేపీ మంత్రులు మునిరత్న, డాక్టర్ కే సుధాకర్ లాంటి నేతలు చర్చలు జరుపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు స్టార్లను బరిలోకి దించాలనే ప్రయత్నాలను నేతలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, అనంత్ నాగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించి కీలక స్థానం నుంచి పోటీ చేయించడమే కాకుండా పార్టీ ప్రచారానికి విరివిగా వాడుకోవాలనే ప్లాన్‌తో నేతలు ఉన్నట్టు సమాచారం.
కన్నడ సినిమా పరిశ్రమలో అనంత్ నాగ్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల కేజీఎఫ్ సినిమాలో డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకొన్నారు. ఇటీవల ఆయన నటించిన మేడ్ ఇన్ బెంగళూరు సినిమా రిలీజై సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.


Click it and Unblock the Notifications











