kiccha sudeep: కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఆయన సౌత్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో నటిస్తున్న సుదీప్ కెరీర్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వేళ సుదీప్ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
1973 సెప్టెంబర్ 2న కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించారు సుదీప్. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివిన ఆయనలో మంచి క్రీడాకారుడు ఉన్నారు. క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే ఆయన నిజానికి ఓ క్రికెటర్ కావాలని ఆశపడ్డారట. కాలేజ్ రోజుల్లో అండర్ 19 వంటి దేశవాళీ టోర్నమెంట్‌లోనూ పాల్గొన్నారు సుదీప్. అయితే నెమ్మదిగా నటన వైపు ఆసక్తి పెంచుకున్న ఆయన ముంబైలోని ప్రఖ్యాత రోషన్ తనేజా నేషనల్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరి నటనలో ఓనమాలు దిద్దారు.

శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అవకాశాల కోసం ప్రయత్నించిన సుదీప్.. 1997లో థయవ్వాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. స్పర్శ సినిమాతో హీరోగా పరిచయమైన సుదీప్‌కు హిచ్చాతో స్టార్ డమ్ దక్కింది. అప్పటి నుంచి ఆయన కిచ్చా సుదీప్ అయిపోయారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పూంక్ అనే హార్రర్ మూవీ ద్వారా సుదీప్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగలో విలన్‌గా నటించడం సుదీప్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డ్‌ను అందుకున్నారు సుదీప్. తర్వాత బాహుబలి బిగినింగ్, సైరా నర్సింహారెడ్డిలలో కీలకపాత్ర పోషించారు.
సుదీప్‌లో నటుడే కాదు దర్శకుడు, నిర్మాత, సింగర్ , రైటర్ కూడా ఉన్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా ఆయన సంచలనం సృష్టించారు. కన్నడ బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా అలరించారు. శాండల్‌వుడ్‌లో అత్యాధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడిగానే కాకుండా ఎన్నో టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ సుదీప్ వ్యవహరిస్తున్నారు. తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన ఆయన ఎందరో పేద పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు ఎయిడ్స్ నిర్మూలనకు కూడా కృషి చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ మ్యాక్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తన 48వ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలాంటి వేళ సుదీప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సరోజా మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతించాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











