ఏ థియేటర్‌లోనైనా టికెట్ రేట్ రూ.200 .. సీఎం సంచలన ప్రకటన
దేశంలో ఎన్ని వినోద సాధనాలు వచ్చినా ప్రజలకు వినోదం అనగానే గుర్తొచ్చేది సినిమాయే. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. దశాబ్ధాలుగా సినిమాతో భారతీయుల జీవితం మమేకమైపోయింది. సినిమా లేని రోజును ఊహించుకోవడం కూడా కష్టమే. దేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఒక మతమైతే , సినీతారలను దేవుళ్లుగా కొలుస్తారు అభిమానులు.
సమాజంపై సినిమా వేసే ప్రభావం అంతా ఇంతా కాదు. సినిమాలలో హీరో హీరోయిన్లను చూసి పోలీసులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎందరో. కర్తవ్యం, ఛాలెంజ్ వంటి సినిమాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. ఇక ఇటీవల సినిమాలు చూసి హత్యలు , దోపిడీలకు పాల్పడుతున్నారంటే ఈ మాధ్యమం ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే ఒకప్పుడు సినిమా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సగటు ప్రేక్షకుడికి సినిమా అందడం లేదు.

సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో దాని భారం అంతిమంగా ప్రేక్షకుడి మీదే పడుతోంది. తమ పెట్టుబడిని రాబట్టుకోవడానికి నిర్మాతలు టికెట్ రేట్లను పెంచేస్తున్నారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఇలా ఎక్కడ చూసినా టికెట్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. వీటికి పాప్‌కార్న్, పార్కింగ్ ఖర్చులు అదనం. ఓ మధ్య తరగతి వ్యక్తి తన కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే ఖచ్చితంగా రూ.2000, రూ. 3000 వదిలించుకోవాల్సిందే.
ఈ పరిణామాలను గమనించిన వైఎస్ జగన్ .. ఆంధ్రప్రదేశ్‌లో తను అధికారంలో ఉన్నప్పుడు టికెట్ ధరలను నియంత్రించడంతో పాటు బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతులు రద్దు చేసింది. అంతేకాదు.. టికెట్‌లను పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ పరిణామాలు ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెంచాయి. పరిస్ధితిని గ్రహించిన సినిమా పెద్దలు మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించారు. చిరు, మహేశ్, ప్రభాస్, రాజమౌళి తదితరులు నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపారు.

తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో నానాటికీ పెరిగిపోతున్న సినిమా టికెట్ రేట్లపై కోర్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను కర్ణాటక బడ్జెట్‌ను సిద్ధరామయ్య మార్చి 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సినీరంగానికి సంబంధించి కీలక ప్రస్తావనలు చేశారు ముఖ్యమంత్రి.
రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను కర్ణాటకలోని అన్ని థియేటర్‌లలో టికెట్ ధర రూ.200గా నిర్ణయించినట్లుగా ప్రకటించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్‌లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫిల్మ్ సిటీని నిర్మించేందుకు గాను మైసూర్‌లో 150 ఎకరాల భూమిని , ఇందుకు రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు.


Click it and Unblock the Notifications











