బాహుబలి నుంచి మా హీరో సీన్‌ను లేపేస్తారా? ప్రభాస్, రాజమౌళిని బహిష్కరిస్తాం.. కన్నడ ఫ్యాన్స్ వార్నింగ్
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందే అమెరికాలో పెయిడ్ ప్రివ్యూలు మొదలయ్యాయి. అలాగే 30వ తేదీన ఇండియాలో కూడా ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా రెండు భాగాలు కలిపి సుమారుగా 5.30 గంటలు ఉంటుంది. ఈ మూవీని మొత్తంగా 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. దాంతో గత రెండు భాగాల్లో కనిపించిన సీన్లు చాలా వరకు ఎపిక్ వెర్షన్‌లో కనిపించకుండా పోయాయి.
బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే లవ్ స్టోరీని ఎత్తివేశాం. అలాగే సెకండ్ పార్ట్‌లో వచ్చే కొన్ని వార్ సీన్లను ట్రిమ్ చేశాం. అలాగే మూడు పాటలను కూడా లేపేశాం. ఇలా కొన్ని సీన్లను ట్రిమ్ చేయాల్సి వచ్చింది అని ప్రభాస్, రానా దగ్గుబాటికి చెప్పారు.
అయితే బాహుబలి ది ఎపిక్ మూవీలో నుంచి కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కిచ్చ సన్నివేశాన్ని తొలగించారనే వార్తల నేపథ్యంలో కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టప్పతో సుదీప్ ఉండే కత్తి ఫైట్ సీన్‌ను తొలగించారు. అలాంటి సన్నివేశాన్ని తొలగించడం సుదీప్ ఫ్యాన్స్‌గా మాకు అవమానం జరిగింది. భవిష్యత్‌లో ప్రభాస్, రాజమౌళి సినిమాలు కన్నడలో రిలీజ్ అయితే వాటిని బహిష్కరిస్తాం. ఈ విషయంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. రాజమౌళికి తీవ్రమైన హెచ్చరిక అంటూ కన్నడ, సుదీప్ అభిమాని ట్విట్ చేశారు.
సుదీప్ అభిమానిగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దాదాపు 5 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు. అయితే భవిష్యత్‌లో ఈ విషయాన్ని తీవ్రంగా కన్నడ వాసులు పరిగణిస్తారా? ఎందుకంటే ఇటీవల పవన్ కల్యాణ్, ఇతర హీరోల సినిమాలను కన్నడ భాషాభిమానులు అడ్డుకొంటున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











