కర్ఫ్యూ టైంలో కారు డ్రైవింగా? మితిమీరిన వేగంతో ప్రమాదం.. హీరోయిన్‌పై కేసు నమోదు
కన్నడ నటి షర్మిలా మాండ్రే, ఆమె స్నేహితులపై కేసు నమోదైంది. శనివారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో కారు డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలపై వసంతనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని వసంతనగర్‌లో ఆమె ప్రయాణిస్తున్న జాగ్వర్ కారు ఉదయం తెల్లవారు జామున 3 గంటలకు ప్రమాదానికి గురైందని వెల్లడించారు. అయితే కేసు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ..

విలాసవంతమైన కారు యాక్సిడెంట్
బెంగళూరులోని వసంతనగర్‌లో రోడ్డు పక్కనే విలాసవంతమైన కారు పడి ఉండటం చూసి శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు కారు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేసి కారు యజమానిని గుర్తించారు. విచారణలో షర్మిలా మాండ్రే తన స్నేహితుడు లోకేష్‌తో ప్రయాణిస్తున్నానని అంగీకరించారు.

షర్మిల స్టేట్‌మెంట్ తీసుకోలేదు
ప్రస్తుతం షర్మిలా మాండ్రే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నందున ఆమె స్టేట్‌మెంట్ తీసుకోవడానికి వీలు కాలేదు. కారు ప్రయాణానికి డాన్ థామస్ పేరుపై బెంగళూరు పోలీసులు ఇచ్చిన అధికారిక కర్ఫ్యూ పాస్ ఉంది. అయితే తాజాగా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో డాన్ పేరు చేర్చలేదు, కేవలం షర్మిలపైనే కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు.

కర్ఫ్యూ సమయంలో ప్రయాణమా?
కర్ఫ్యూ సమయంలో తెల్లవారు జామున 3 గంటలకు మితిమీరిన వేగంతో కారులో ప్రయాణించాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయంపై వివరాలు సేకరించాల్సి ఉంది అని బెంగళూరు పోలీసులు అన్నారు. త్వరలోనే షర్మిలా, లోకేష్‌ను విచారించి వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Recommended Video

మద్యం మత్తులో కారు ప్రయాణం
ఇదిలా ఉండగా, షర్మిలా మాండ్రే, తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో కారులో ప్రయాణించారని, ఆ కారణంగానే వాహనం ప్రమాదానికి గురైందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే పోలీసులు ఆ ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని కేసు విచారిస్తున్నారు.


Click it and Unblock the Notifications











