సిద్దార్థ్!.. మీకు క్షమాపణ చెబుతున్నాం.. శివరాజ్ కుమార్, ప్రకాశ్ రాజ్ ఎమోషనల్
యువ హీరో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం చిత్త సినీ అభిమానులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన సిద్దార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కావేరీ జలాలను తమిళనాడుకు మరలిస్తున్నారనే విషయంపై కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిత్త ప్రమోషన్స్‌కు వెళ్లిన సిద్దార్థ్‌ను కన్నడ నిరసన కారులు అడ్డుకోవడం వివాదంగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...
చిత్త సినిమా ప్రమోషన్స్ కోసం సిద్దార్థ్ బెంగళూరులోని ఎస్ఆర్వీ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా కావేరి నదీజలాలపై నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు అక్కడికి చేరుకొన్నారు. ఇక్కడ తమిళ సినిమా ప్రమోషన్స్ చేయడానికి వీలు లేదని అభ్యంతరం తెలిపారు. సిద్దార్థ్ ప్రెస్ మీట్‌కు ఆటంకం కలిగించారు. ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకోమని ఆందోళన చేశారు. దాంతో సిద్దార్థ్ తన ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

అయితే సిద్దార్థ్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ ఖండించారు. సిద్దార్థ్‌కు ప్రకాశ్ రాజ్ అండగా నిలిచారు. నిరసనకారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. దశాబ్దాలుగా పరిష్కరించలేని కావేరీ నదీ జలాలు వివాదంపై రాజకీయ పార్టీలను, ఆయా పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను ప్రశ్నించకుండా.. సినీ నటులుపై ప్రతాపం చూపిస్తారా? సాధారణ ప్రజలను, సినీ నటులను ఇబ్బంది పెడితే సమస్య పరిష్కారం అవుతుందా? ఓ కన్నడవాసిగా, కన్నడ వాసుల తరఫున నేను సిద్దార్థ్‌కు క్షమాపణ చెబతున్నాను అని ప్రకాశ్ ట్వీట్ చేశారు.

ఇక సిద్దార్థ్‌కు ఎదురైన సంఘటనపై శివ రాజ్‌కుమార్ స్పందించారు. సిద్దార్థ్‌కు కన్నడ పరిశ్రమ తరఫున క్షమాపణలు తెలిపారు. ఆయన ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ తరుఫున నేను ఈ రోజు సిద్దార్థ్‌కు సారీ చెబుతున్నాను. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకొంటాం. కన్నడ ప్రజలు మంచి వారు. వారికి భాష, సినిమా అంటే ప్రేమ ఉంది. కన్నడ ప్రజలు భాషాబేధం లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు అని శివ రాజ్‌కుమార్ అన్నారు.

ఇదిలా ఉండగా, సిద్దార్థ్ నటించిన తమిళ చిత్రం చిత్త సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు క్రిటిక్స్, సినీ అభిమానులు పాజిటివ్‌గా రెస్సాండ్ అవుతున్నారు. ఈ సినిమా సిద్దార్థ్‌కు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకొంటున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన ఆయనకు కన్నడ వాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.


Click it and Unblock the Notifications











