Thug Life: థగ్ లైఫ్ కన్నడ వివాదంలో ట్విస్టు.. హైకోర్టులో కమల్ హాసన్ పిటిషన్ దాఖలు!
కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా నిషేధం వివాదంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకొన్నది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకొనేందుకు కన్నడ సామాజిక కార్యకర్తలు, భాషాభిమానులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొండిగా వ్యవహరిస్తున్న ఇరు వర్గాలు తమ ఎత్తులు, పైఎత్తులు వేసేందుకు సిద్దమయ్యారు. కన్నడవాసుల నిషేధం పిలుపుకు చెక్ పెడుతూ కమల్ హాసన్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తమిళ సినిమా రంగంలోను, అలాగే దక్షిణాది సినిమా రంగంలో నాయకన్ సినిమా తర్వాత సుమారుగా 37 ఏళ్ల అనంతరం కమల్ హాసన్, మణిరత్నం థగ్ లైఫ్ సినిమా కోసం జతకట్టారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని కామెంట్ చేశాడు. ఆయన మాటలు కన్నడ భాషాభిమానుల మనోభావాలను దెబ్బ తీశాయి. దాంతో కమల్ హాసన్‌పై కన్నెర్ర చేశారు.

కన్నడ భాషను కించ పరిచే విధంగా మాట్లాడారంటూ కన్నడ వాసులు ఆయన నటించిన థగ్ లైఫ్‌ను రిలీజ్‌ను అడ్డుకొంటామని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే సినిమా రిలీజ్‌పై బ్యాన్ విధిస్తాంటూ హెచ్చరించారు. అయితే తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. ఒక వేళ నేను తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెబుతాను. అంతకుమించి నేను ఏమీ చేయలేను. నేను కన్నడ భాషను కించపరచలేదు అంటూ కమల్ వివరణ ఇచ్చారు. కమల్ వివరణతో సంతృప్తి చెందని కన్నడ ప్రజలు ఈ సినిమాను రిలీజ్ కాకుండా నిషేధం విధించిన.. ఈ చిత్రాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.
అయితే కన్నడ ప్రజలు తన సినిమాపై నిషేధం ప్రకటించడంపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. కన్నడ సంఘాల నిర్ణయాన్ని, నిషేధాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సినిమా రిలీజ్‌ను, ప్రదర్శనను అడ్డుకోకుండా పోలీసులకు, పోలీసు విభాగానికి ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో రిక్వెస్ట్ చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తరుఫున పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ పిటిషన్‌పై విచారణను మంగళవారం అంటే జూన్ 3వ తేదీన కోర్టు చేపట్టనున్నది అని డెక్కన్ హెరాల్డ్ కథనాన్ని ప్రచురించింది.
తన క్లయింట్ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. కాబట్టి ఈ ఆయనకు, ఆయనతోటి నటీనటులు, దర్శకుడికి కన్నడ, తమిళనాడు ప్రజలు సంఘీభావం ప్రకటించాలి. ఈ సినిమాపై అనసవరంగా వివాదం సృష్టించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పును ఎత్తి చూపే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొన్న నిషేధం నిర్ణయాన్ని ఎత్తివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కమల్ తరఫున న్యాయవాది పిటిషన్‌లో అభ్యర్థించారు.
అలాగే థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కర్ణాటక పోలీసుల సహాయంతో తగిన చర్యలు చేపట్టాలి. సినిమా కోసం పనిచేసిన నిర్మాత, దర్శకులు, నటీనటులకు తగిన రక్షణ కల్పించాలి. అలాగే మూవీని పంపిణి చేసే వారికి, ప్రదర్శించే వారికి, థియేటర్ల వద్ద తగిన రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











