యష్‌తో సినిమా నిర్మించను.. నా కొడుకును పిలువను.. తల్లి పుష్ప అరుణ్ కుమార్ సంచలనం వ్యాఖ్యలు
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో రాకింగ్ స్టార్‌గా మారిన యష్ తల్లిదండ్రులు పుష్ప, అరుణ్ కుమార్ నిర్మాతలుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. PA (Pushpa Arun Kumar) ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌పై కొత్తలవాడి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సిరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పృథ్వీ అంబార్ హీరోగా, కావ్య శైవ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో గోపాల్ దేశ్‌పాండే, రాజేశ్ నటరంగ, అవినాష్, మన్షీ సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన గంధర్వ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం బెంగళూరులోని ప్రముఖ మల్టీప్లెక్స్ పీవీఆర్ ఓరియన్ మాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ మాట్లాడుతూ..
కొత్తలవాడి అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకులో ఉన్న ఒక గ్రామం పేరు,. అందుకనే ఇక్కడ చిత్రం ఎక్కువ భాగాన్ని చిత్రీకరించారు. సినిమా కథకు సంబంధించిన స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా బృందం స్థానిక యాసను కూడా సంభాషణల్లో ఉపయోగించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్, ఆయన సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్త బ్యానర్‌ను స్థాపించి కొత్తవారికి అవకాశం ఇవ్వటానికి నిర్మాతగా మారామని పుష్ప అరుణ్‌కుమార్ తెలిపారు.

నాకు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మా అమ్మాయిని ఆంధ్రాకు కోడలిగా పంపించాం. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే ఇష్టం. తెలుగు బాగా నేర్చుకోవాలని ప్రయత్నించాను. యష్ తల్లిగా గుర్తింపు పొందాను. కానీ నేను నిర్మాతగా పేరు సంపాదించాలని అనుకొంటున్నాను. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల మధ్య మంచి స్నేహం ఉంది. రెండు పరిశ్రమల కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. తెలుగు వాళ్లు ఇక్కడికి రావాలి. కన్నడ వాళ్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు సినిమాలు చాలా చూస్తాను. అన్ని సినిమాలు చూస్తుంటాను. తెలుగు సంప్రదాయలంటే నాకు ఇష్టం అని పుష్ప అరుణ్ కుమార్ అన్నారు.
మేము నిర్మాతలుగా మారి తొలి చిత్రంగా కొత్తలవాడి సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా కేవలం కన్నడ కథ కాదు. ఓ గ్రామంలో ఉండే సమస్య, పెద్దరికం మధ్య నలిగే ఎమోషన్స్ గా కథ ఉంటుంది. ఈ స్టోరీ కేవలం ఒక భాషకు సంబంధించినది కాదు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకొంటుంది. నిర్మాతగా మారక ముందు నేను యష్ వద్ద చాలా నేర్చుకొన్నాను. వృథాగా డబ్బు ఖర్చు పెట్టకూడదనే విషయంలో యష్ నాకు స్పూర్తి. సినిమాకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టాం. అందుకే సినిమా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నది. యష్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్స్ తీసుకోలేదు. వాడి నుంచి గుడ్ అనే మాట కోసం ఎదురు చూస్తున్నాను అని ఆమె అన్నారు.

యష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అన్ని భాషల్లో చేయనున్నాడు. నాకు నా కొడుకును తెర మీద చాలా స్టైలిష్‌గా చూడాలని అనుకొంటాను. అదే విషయం తనకు చెబుతాను. కానీ అలా ఎప్పుడూ స్టైలిష్‌గా నటిస్తే.. ఎవరూ చూడరు అని అంటాడు. నీ కోసం సినిమా చేయలేను కదా అంటాడు. నాకైతే స్టైలిష్‌గా, అందంగా కనిపించాలి. మంచి డ్రస్ వేసుకోవాలని అనుకొంటాను. నేను యష్‌తో సినిమా చేయను. వాడికే బాగా డబ్బు ఉంది. వాడే సినిమాలు చేసుకొంటాడు. బాగా ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి.ఆకలి లేని వాడికి అన్న పెట్టినా ఉపయోగం ఉండదు. ఆకలితో ఉన్న వాడికే భోజనం విలువ తెలుస్తుంది. యష్ కోసం డబ్బులు పెట్టే పెద్ద నిర్మాతలు చాలా మంది ఉన్నారు. మేము కొత్త వారికి అవకాశం ఇస్తూ మంచి సినిమాలు చేయాలని అనుకొంటున్నాం అని పుష్ప అరుణ్ కుమార్ తెలిపారు.

నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం ప్రతిభావంతులైన కొత్తవారికి అవకాశాలు ఇవ్వడమే. యష్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం అందర్నీ కలుస్తూ చాలా కష్టాలు పడ్డాడు. ఆ సమయంలో యష్ కష్టాలు చూసి.. అప్పుడే నేను ఓ నిర్ణయం తీసుకొన్నాను. ఒకవేళ బాగా డబ్బులు వస్తే.. నిర్మాతగా మారి కొత్త వారితో సినిమాలు తీయాలన్న కోరిక కలిగింది. నిర్మాతగ మారడానికి అదే నాకు స్పూర్తి. యష్ రమ్మంటే ప్రమోషన్స్‌కు వస్తాడు. కానీ నేను మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకొన్న తర్వాత అవసరమైతే యష్‌ను పిలుస్తాను. మా సినిమాలో కంటెంట్ ఉంటే..వస్తారు. యష్ తల్లి సినిమా తీసిందని ముందు వస్తారు. మంచి సినిమా తీయకపోతే మరోసారి రారు. కాబట్టి యష్‌ను నేను ప్రమోషన్స్‌కు పిలువను అని ఆమె అన్నారు.

సినిమా నిర్మాతగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు యష్ తల్లిదండ్రులు అనే ట్యాగ్ మాపై ఎలాంటి ఒత్తిడి కలిగించలేదు. యష్ కూడా పెద్ద సినిమాలు తీశాడు. అతడి నుంచి మేము చాలా నేర్చుకొన్నాం. యష్ చేసే సినిమాలు చూసే మేము ఈ సినిమాకు నిర్మాతలుగా మారాం. యష్ ఇప్పుడు పెద్ద హీరో, నిర్మాత. మేము చిన్నవాళ్లం. మేము కూడా మంచి సినిమాలు తీసి పెదద్ నిర్మాతలుగా కావాలన్నదే మా తాపత్రయం అని పుష్ప అరుణ్ కుమార్ చెప్పారు.


Click it and Unblock the Notifications











