Mammootty కుటుంబంలో పెను విషాదం.. పుట్టెడు దు:ఖంలో ఉన్న హీరోకు వేలాది మంది సంతాపం
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కుటంబంలో విషాదం చోటు చేసుకొన్నది. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. ఆమెకు మమ్ముట్టితోపాటు ఐదుగురు సంతానం కలిగి ఉన్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మమ్ముట్టికి వందలాది మంది సెలబ్రిటీలు, రాజకీయనేతలు, వేలాది మంది అభిమానులు సంతాపం తెలిపారు. మమ్ముట్టి తల్లి మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మమ్ముట్టి తల్లి ఫాతిమా కొద్ది రోజులుగా అస్వస్థత కారణంగా కొచీలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఆమె కోలుకొన్నట్టు కనిపించారు. కానీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను చెంబులోని జుమా మసీదులో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.

ఫాతిమాకు మమ్ముట్టి పెద్ద కుమారుడు. ఇబ్రహీం, జక్కారియా కుమారులు ఉన్నారు. అమీనా, సౌదా, షఫీనా అనే కూతుళ్లను కలిగి ఉన్నారు. తల్లి మరణం విషాదంలో కూరుకుపోయిన కుటుంబాన్ని పలువరు ప్రముఖులు పరామర్శించారు.
కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేస్తూ.. మాతృ వియోగంతో పుట్టుడు దు:ఖంలో ఉన్న మమ్ముట్టికి నా ప్రగాఢ సంతాపం. ఉదయమే నేను మాట్లాడి పరామర్శించాను. తల్లి మరణిస్తే ఎంత బాధ ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. తల్లి మరణంతో ఏర్పడిన లోటును ఎవరూ పూడ్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని శశిథరూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మమ్ముట్టిని పరామర్శించిన వారిలో కేరళ సీపీఐ నేతలు, మంత్రులు ఉన్నారు. మంత్రులు వీఎన్ వాసవన్, ఎంవీ గోవిందన్ ఉన్నారు. పలువరు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
మమ్ముటి కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ఆయన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన ఈ చిత్రంలో మమ్ముట్టి రా ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











