పోలీసును కాలితో తన్నుతావా? ‘మోహన్‌లాల్’పై కేసు.. ముఖ్యమంత్రి దృష్టికి వివాదం
పోలీసుల ఆత్మగౌరవాన్ని ఏ మాత్రం కించపరిచినా సినీ నిర్మాతలకు, దర్శకులకు కష్టాలు తప్పడం లేదు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కష్టాలు మొదలయ్యాయి. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో మంజు వారియర్, తొవినో థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ వివాదానికి కేంద్ర బిందువైంది. వివరాల్లోకి వెళితే..

పోలీసుల ఛాతిపై మోహన్‌లాల్ కాలితో
లూసిఫర్ మూవీలో పోలీసులను హీరో కాలితో తన్నుతున్న ఓ సన్నివేశాన్ని పోస్టర్‌గా ముద్రించారు. ఈ పోస్టర్ పోలీసుల మనోభావాలను తలదన్నేలా ఉంది. వెంటనే ఆ పోస్టర్లను, సినిమాలో సన్నివేశాన్ని తొలగించాలి అని కేరళ పోలీసు డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు చేసింది. పోస్టర్‌లో పోలీసు ఛాతిపై మోహన్‌లాల్ తన్నుతూ ఉండటం కనిపించింది.

పోస్టర్లతో ప్రజల్లో చులకనభావం
పోలీసులను కించ పరిచే విధంగా ఇలాంటి పోస్టర్లు ముద్రిస్తే భావితరాలకు, ముఖ్యంగా యువతకు చులకన భావం ఏర్పడుతుంది. పోలీసులంటే ప్రజల్లో గౌరవభావం తగ్గిపోతుంది అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేరళ పోలీసు అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. అలాంటి పోస్టర్లు ముద్రించడం బాధ్యతారహితం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అండగా నిలుస్తాయి అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులపై నేరస్థుల దాడి
పోలీసులను కించపరిచే విధంగా సినిమాల్లో సన్నివేశాలు ఉండటం వల్ల నేరస్థులు విచ్చలవిడిగా పోలీసులపై దాడి చేస్తున్నారు. మద్యం సేవించడం, ధూమపానం సీన్లు హైలెట్ చేస్తున్నారు. సినిమాల్లో ఇలాంటి సీన్ల వల్ల యువత కూడా పెడదారులు పడుతున్నది. గౌరవప్రదమైన పోలీసు వృత్తిని మర్యాదపూర్వకంగా చూపించాలి అని కేరళ పోలీసుల తెలిపారు.

లూసిఫర్‌పై క్రైస్తవుల ఆగ్రహం
లూసిఫర్ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలపై క్రైస్తవ మతస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రీకరించడం దారుణం అనే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గతవారం రిలీజైన ఈ చిత్రం సానుకూలమైన టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ కీలక పాత్రను పోషించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











