Marco: మార్కో సీక్వెల్ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతలు.. ఉన్ని ముకుందన్ రక్తపాతం ఎప్పుడంటే?
దక్షిణాదిలో సంచలన విజయం సాధించిన చిత్రం మార్కో. ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకొన్న ఉన్ని ముకుందన్ ఒక్కసారిగా యాక్షన్, ఫైర్ బ్రాండ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ చిత్రం కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. అయితే ఇలాంటి సినిమాకు రెండో భాగం ఉంటుందని ఈ మూవీ చివర్లో హింట్ కూడా ఇచ్చారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆ చిత్ర దర్శకుడు ఆసక్తికరమైన వార్తను అందించారు. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మార్కో చిత్రం విషయానికి వస్తే.. ఉన్ని ముకుందన్ హీరోగా జగదీష్, సిద్దికీ, అన్సన్ పాల్, యుక్తి తరేజా లాంటి నటీనటులు నటించారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టు మితీమీరిన హింస, రక్తపాతంతో నింపారు. సాధారణ ఆడియెన్స్ తట్టుకోలేని విధంగా వయోలెన్స్‌ను చూపించారు. అయితే యాక్షన్, ఫైట్స్ ఎపిసోడ్స్ మాత్రం సినిమా లవర్స్‌ను మెప్పించడమే కాకుండా విశేషంగా ఆకట్టుకొన్నాయి.

డిసెంబర్ 20 తేదీన రిలీజై దాదాపు నెల రోజులకుపైగా మార్కో చిత్రం థియేటర్లలో సందడి చేసింది. విడుదలైన ప్రతీ భాషలోను భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. హానీఫ్ అదేని దర్శకత్వంలో రూపొంది ఈ సినిమా మలయాళంలో రికార్డు కలెక్షన్లను నమోదు చేయడం తెలిసిందే. ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద 42 కోట్ల గ్రాస్, ఇతర భాషల్లో 25 కోట్ల రూపాయలు, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 105 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
అయితే మార్కో సక్సెస్ అందించిన ఉత్సాహంతో నిర్మాతలు షరీఫ్ మహ్మద్ ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. క్యూబ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు హనీఫ్ అదేనీ కాకుండా కొత్త దర్శకుడిని ఈ బ్యానర్ పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది.
మార్కో 2 సినిమా సీక్వెల్‌కు డైరెక్టర్‌గా పాల్ జార్జ్‌ను పరిచయం చేస్తున్నాం. ఆయన జర్నీ ఎక్సైటింగ్ ప్రాజెక్టుతో మొదలు కాబోతున్నది. మీరు మరోసారి కొత్త అనుభూతికి సిద్దమా? మార్కో 2 సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతున్నది అంటూ ఓ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్‌పై దక్షిణాదిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, మార్కో చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీకి ఓటీటీలో కూడా భారీ రెస్సాన్స్ లభిస్తున్నది. కొద్ది రోజుల్లోనే రికార్డు వ్యూస్ సాధించిందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











