మీ టూ షాక్: మలయాళ పరిశ్రమలో లైంగిక వేధింపులు: నటుడు ముఖేష్ మీద ఆరోపణలు!
#మీ టూ ఉద్యమం చివరకు మలయాళ చిత్ర సీమకు కూడా పాకింది. ఈ క్రమంలో మలయాళ నటుడు ముకేష్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. టెస్ జోసెఫ్ అనే బాలీవుడ్ టెక్నికల్ డైరెక్టర్ ముఖేష్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు చేశారు. 19 ఏళ్ల క్రితం ముఖేష్ హోస్ట్ చేసిన 'కోటీశ్వరన్' అనే క్విజ్ షో సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
టెస్ జోసెఫ్ ట్విట్టర్ ద్వారా ఈ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ముఖేష్ తనను పలుసార్లు పిలిచాడని, నా రూమును అతడి రూమ్ పక్కకు మార్పించాడని.... ఆ సమయంలో తన బాస్, తృణమూల్ కాంగ్రెస్ లీడర్ డెరెక్ ఓబ్రిన్ షూటింగ్ స్పాట్ నుండి వెళ్లి పోవడానికి సహాయం చేశారని తెలిపారు. ఆ రోజు అతడు సహాయం చేయడం వల్లనే తాను ముఖేష్ బారి నుండి తప్పించుకున్నట్లు తెలిపారు.

'ఆ సమయంలో నా వయసు 20 సంవత్సరాలు. ముఖేష్ కుమార్ హోస్ట్ చేస్తున్న 'కోటీశ్వరన్' అనే క్విజ్ షోకు పని చేస్తున్నారు. రెండు మూడు సార్లు అతడు నన్ను రూముకు పిలవడంతో అతడి తప్పుడు ఉద్దేశ్యం అర్థమంది. తర్వాతి షెడ్యూల్‌లో నా రూమ్ అతడి రూమ్ పక్కకు మార్పించుకున్నాడు. 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనలో డెరెక్ సహాయంతో తప్పించుకున్నాను' అని టెస్ జోసెఫ్ ట్వీట్ చేశారు.
టెస్ జోసెఫ్ చేసిన ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. నువ్వు ఆరోపణలు చేస్తుంది 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న నటుడు ముఖేష్ గురించేనా? అంటూ పలువురు మళ్లీ మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఆమె అవును అని రిప్లై ఇవ్వడమే కాదు... అతడు ఇపుడు పొలిటీషియన్ కూడా, ప్రస్తుతం కొల్లాం ఎంఎల్ఏగా ఉన్నారు అని స్పష్టం చేశారు.
అయితే ఈ ఆరోపణలను ముఖేష్ ఖండించారు. తనకు అసలు టెస్ జోసెఫ్ ఎవరో కూడా తెలియదన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరు ఎవరిపై అయినా ఆరోపణలు చేయవచ్చు. నాకు టెస్ జోసెఫ్ ఎవరో కూడా గుర్తు లేదు అని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











