మోహన్‌లాల్‌కు కరోనా షాక్.. బిగ్‌బాస్ షో నిలిపివేత
మలయాళ టెలివిజన్ ప్రేక్షకలకు కరోనా గట్టి షాకిచ్చింది. సూపర్‌స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న ఈ షో పలు వివాదాలతో ముందుకెళ్తున్నది. అయితే ఈ క్రమంలో కరోనావైరస్ ప్రమాదకరంగా మారడంతో ఈ రియాలిటీ షోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్ణయం తీసుకొన్నది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత షోను కొనసాగించే విషయంపై ప్రకటన చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుండటంతో రెండు రోజుల క్రితమే తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు, సాంకేతిక నిపుణులను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. సిబ్బంది ఆరోగ్య కారణాల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా షోను కూడా నిలిపివేయాలనే సంచలన నిర్ణయం తీసుకొన్నది. బిగ్‌బాస్ చరిత్రలో రియాలిటీ షోను మధ్యలోనే నిలిపివేయడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు వెల్లడించినట్టు సమాచారం.

బిగ్‌బాస్ మలయాళం షో సీజన్ 2 చివరి ఎపిసోడ్ మార్చి 20వ తేదీ శుక్రవారం ప్రసారం కానున్నది. ఏషియానెట్‌లో ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో ఇదే చివరి ఎపిసోడ్ అని, తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత మళ్లీ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు.
అయితే తమ సంస్థలో పనిచేసే సిబ్బందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, దేశ ప్రయోజనాల దృష్టా మాత్రమే తమ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











