హీరో కాదు విలన్.. హీరోయిన్ దెబ్బతో బయటపడ్డ బాగోతం .. బిల్డింగ్ దూకి ఎస్కేప్
సినిమాల్లో హీరోలుగా నటించిన పలువురు నిజ జీవితంలో నేరస్తులుగా మారిన ఉదంతాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో. సినిమాలలో మంచితనం, మానవత్వం అంటూ ఉపన్యాసాలు చెప్పిన వారే రియల్ లైఫ్‌లో విలన్లుగా నేరస్తులుగా మారుతున్నారు. గతేడాది అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉండొచ్చాడు. ఇక కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసుల్లో సల్మాన్ ఖాన్.. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు జైలు జీవితం గడిపిన వారే. వీరే కాదు పలు రకాల కేసుల్లో జైలు శిక్షలను , కేసులను ఎదుర్కొంటున్న వారు ఎందరో.
తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షైన్ టామ్ చాకో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేరళలో నిర్వహించిన డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమంలో హీరోయిన్ విన్సీ అలోషియస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూత్రవాక్యం సినిమా సెట్స్‌లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వివరించింది. 2019లో వికృతి సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన విన్సీ ఆ తర్వాత జనగణమన, 1744 వైట్ ఆల్టో, సౌదీ వెళ్లక్క, రేఖ, పద్మిని, ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్ వంటి చిత్రాల్లో నటించారు.

ఇటీవల విడుదలైన రేఖాచిత్రంలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విన్సీ. ఓ సోషల్ మీడియా పోస్టులో టామ్ చాకో వ్యవహరించిన తీరును ఇన్‌డైరెక్ట్‌గా వివరించారు. తాను కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్తుండగా.. ఆ హీరో తన ఒంటిపై చేయి వేసి డ్రెస్ సరిచేయడానికి యత్నించాడని ఆరోపించింది. తన ముందే దుస్తులు మార్చుకోవాల్సిందిగా టార్చర్ చేశాడని.. ఓ ప్యాకెట్ తీసి తెల్లటి పొడిని నోట్లో వేసుకోవడం కనిపించిందని విన్సీ పేర్కొంది. వీటిలో ఎక్కడా టామ్ చాకో పేరును ఆమె వెల్లడించలేదు. అయితే ఆ వెంటనే కేరళ ఫిలిం ఛాంబర్‌కు విన్సీ ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో పోలీసులకు దొరక్కుండా పారిపోయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి దూకి.. మెట్ల దారిలో , స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అయితే పోలీసుల రాకపై ముందే టామ్ చాకోకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నిజానికి టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2015లోనే డ్రగ్స్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా.. తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. తాజాగా హోటల్ నుంచి తప్పించుకున్న వీడియోలు బయటకు రావడంతో కేరళ సినీ పెద్దలు ఫైర్ అవుతున్నారు. మలయాళ పరిశ్రమలో టామ్ చాకోపై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి టామ్ చాకో దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











