Saana Kastam Lyrical: గ్రేస్ మూమెంట్లతో చిరంజీవి రచ్చ.. రెజీనా గ్లామర్ ట్రీట్ అదుర్స్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమ జోష్ మీద కనిపిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆ మధ్య రాజకీయాల కోసం చాలా గ్యాప్ తీసుకున్న ఆయన.. కొన్నేళ్ల క్రితమే 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటిస్తూ యమ ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
మెగా హీరోల కలయికలో రూపొందుతోన్న 'ఆచార్య' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించి.. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, దాదాపుగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ వేరే సినిమాలను మొదలెట్టారు.

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో.. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇవన్నీ తెగ ట్రెండ్ అయిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాటను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ముందుగా ప్రకటించిన దాని ప్రకారం తాజాగా 'ఆచార్య' మూవీ నుంచి 'సానా కష్టం వచ్చిందే మందాకినీ' అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ఆడిపాడింది. ఆద్యంతం అదిరిపోయేలా ఉన్న ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేశారు. అలాగే, దీనికి భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాటను రేవంత్, గీతా మాధురి కలిసి ఆలపించారు. ఇందులో చిరంజీవి గ్రేస్ మూమెంట్లతో మరోసారి ఫిదా చేయగా.. రెజీనా గ్లామర్ ట్రీట్‌తో అదుర్స్ అనిపించింది. మొత్తంగా ఇది త్వరగానే ప్లే లిస్టుల్లో చేరిపోయింది.
క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











