‘ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి గుచ్చే గులాబీ: మెలోడీ సాంగ్‌తో మెస్మరైజ్ చేసిన అర్మాన్
అప్పుడెప్పుడో విడుదలైన 'అఖిల్' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని అఖిల్. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత కూడా అతడు చేసిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో మొదటి హిట్ కోసం అతడు మరింత సమయం వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీలోని ఓ పాట విడుదలైంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏపిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఒకరోజు ముందే ఈ సినిమాలోని 'గుచ్చే గులాబి' అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడాడు. అనంత్ శ్రీరామ్, శ్రీమణి సంయుక్తంగా లిరిక్స్ రాశారు.

రొమాంటిక్ మెలోడీ జోనర్‌లో వచ్చిన ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ పాట మ్యూజిక్, అర్మాన్ గాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఇందులో అఖిల్, పూజా హెగ్డే కనిపించిన తీరు కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది తరచూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమా విడుదల కూడా ఆలస్యం అయింది. దీంతో ఈ మూవీని రీషూట్ చేయాలనకుంటున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'ను జూన్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











