అల.. వైకుంఠపురములో అప్‌డేట్: ట్రెండింగ్ అవుతున్న సామజవరగమన
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ మేరకు ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు త్రివిక్రమ్. ఇందులో భాగంగా చిత్రంలోని 'సామజవరగమన' తాలూకు 20 సెకనుల సాంగ్ రిలీజ్ చేస్తూ త్వరలోనే ఫుల్ సాంగ్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్‌పై సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా తమన్ సంగీతం అందించారు. ఎంతో వినసొంపుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా రాబోతున్న అల.. వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.
అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు బన్నీ అభిమానులు. వారందరి అంచనాలను రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని సమాచారం.


Click it and Unblock the Notifications











