Pushpa The Rise: చరిత్ర సృష్టించిన సమంత సాంగ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ ‘పుష్ప’
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు భారీ స్థాయిలో వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు టాలీవుడ్ స్టామినా గణనీయంగా పెరిగింది. దీంతో మన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. ఈ కారణంగానే మన పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు అందరూ పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ఎన్నో ఆ తరహా సినిమాలు పట్టాలపై ఉన్నాయి. అందులో టాలీవుడ్ బడా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సీనియర్ డైరెక్టర్ లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప.. ద రైజ్' ఒకటి. తాజాగా ఈ మూవీ సౌత్ ఇండియా రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప'గా మారిపోయిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేయగా.. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.

విడుదలకు టైం.. సందడి షురూ చేసి
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా ఈ మూవీ సందడిని, ప్రమోషన్‌ను షురూ చేసేసింది యూనిట్.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసింది
'పుష్ఫ' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి ఇటీవలే 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'సామీ సామీ', 'ఇది నా అడ్డా' పాటలను వదలగా వీటికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ సొంతమైంది.

ఊ అంటావా.. ఊఉ అంటావా అంటూ
'పుష్ప' మూవీ నుంచి ఏ సాంగ్ వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఈ క్రమంలోనే దీని నుంచి తాజాగా 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' అంటూ సాంగే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాటలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించి మెప్పించింది.

రికార్డు స్థాయిలో రెస్పాన్స్.. 24 గంటల్లో
'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాటకు అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో దీనికి రికార్డు స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా 24 గంటల్లోనే ఈ పాట 12.39 మిలియన్ వ్యూస్‌ను, 634K లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. దీంతో ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

సౌతిండియా రికార్డును క్రియేట్ చేసేసి
'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాటకు 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ రావడంతో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ పాట సౌతిండియాలోనే ఎక్కువ వ్యూస్ సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. లైకుల విషయంలో మాత్రం 8వ స్థానానికి చేరుకుంది. అలాగే, తెలుగులో ఎక్కువ లైకులు సాధించిన చిత్రాల్లో నాలుగో ర్యాంక్ సాధించింది.


Click it and Unblock the Notifications











