‘పుష్పక విమానం’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్: ప్రత్యేక ఆకర్షణ రామ్ మిరియాల వాయిస్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన 'దొరసాని'తో లాంచ్ అయిన అతడికి నిరాశే ఎదురైంది. కానీ, నటుడిగా మాత్రం మొదటి చిత్రంతోనే మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక, ఆ తర్వాత చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకున్న ఈ కుర్రాడు.. మరింత పరిణితితో నటించి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌లోనే ప్రస్తుతం 'పుష్పక విమానం' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా దీని నుంచి ఓ పాట విడుదలైంది.
ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న మూడో సినిమానే 'పుష్పక విమానం'. దామోదర అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు 'పుష్పక విమానం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ద హిల్స్, టంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ బాషీ, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాతో ముగ్గురు అమిత్ దాసాని, సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్లుగా పరిచయం అవుతున్నారు.

మార్చి 15 అంటే ఈరోజు ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని 'పుష్పక విమానం' చిత్రం నుంచి 'సిలకా' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 'చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా' అనే చైతన్యవంతమైన పాటతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపును దక్కించుకున్న రామ్ మిరియాల దీనిని కంపోజ్ చేయడంతో పాటు పాడాడు. అతడి గొంతు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక, ఈ లిరికల్ వీడియోలో ఆనంద్ హీరోయిన్‌ను పెళ్లాడినట్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











