Acharya: చిరంజీవి సినిమా పాటపై కేసు నమోదు.. పోలీసులను ఆశ్రయించిన RMPల సంఘం
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు పదుల సంఖ్యలో వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో పాటు హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్న కారణంగానే ఇవి ఎక్కువయ్యాయి. అదే సమయంలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా కలిసి సినిమాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు వస్తున్న చిత్రమే 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే.
మెగా హీరోల కలయికలో రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌లు వచ్చిన కారణంగా ఇది కాస్తా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించి.. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, దాదాపుగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించేసింది.

తండ్రీ కొడుకులు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో.. 'ఆచార్య' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని తెరకెక్కించారు. ఇక, ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇవన్నీ తెగ ట్రెండ్ అయిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ జోష్‌తోనే రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి 'సానా కష్టం వచ్చిందే' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనికి కూడా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.
'ఆచార్య' స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ఆడిపాడింది. ఆద్యంతం అదిరిపోయేలా ఉన్న ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేశారు. అలాగే, దీనికి భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాటను రేవంత్, గీతా మాధురి కలిసి ఆలపించారు. ఇందులో చిరంజీవి గ్రేస్ మూమెంట్లతో మరోసారి ఫిదా చేయగా.. రెజీనా గ్లామర్ ట్రీట్‌తో అదుర్స్ అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ పాటపై RMP, PMPల సంఘం సభ్యులు జనగాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి కారణం ఇందులో 'యాడాడో తాకాలనీ.. కుర్రాళ్లే RMPలు అవుతున్నారే' అనే లిరిక్స్ ఉండడమేనట. ఇది వాళ్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పోలీసుకులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం.
'ఆచార్య' మూవీలో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











