Game Changer: చరణ్ కోసం దిల్ రాజు రిస్క్.. కేవలం పాటలకే అన్ని కోట్లా!
టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాలనే చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాలతో వచ్చి సక్సెస్‌లను అందుకుంటోన్నాడు. దీనికితోడు గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకోవడంతో పాటు గ్లోబర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకూ వచ్చింది మొత్తం సూపర్‌గా ఉందని అంటున్నారు. అలాగే, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బడ్జెట్ గురించి తాజాగా దిల్ రాజు ఊహించని కామెంట్స్ చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. 'గేమ్ చేంజర్ మా సంస్థ నుంచి వస్తున్న 50వ చిత్రం. అందుకే దీన్ని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ సినిమాలో ఒక్కో పాటకు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల ఖర్చు చేశాం. అంటే.. పాటల కోసమే దాదాపుగా రూ. 40 కోట్లు ఖర్చు పెట్టాం. సినిమాలో చూస్తే ఆ ఖర్చు మీకు కనిపిస్తుంది' అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీ ఆల్బమ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











