ఒక్క పాటతో ఓవర్ నైట్ పాపులారిటీ.. ఏకంగా సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన కార్తికేయ
సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత నష్టాలు ఏమేరకు జరుగుతున్నాయో, అంతకన్నా ఎక్కువ అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అదే విధంగా ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. జీ తెలుగు వారు నిర్వహిస్తున్న సరిగమప కొత్త సీజన్లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన ఆమె రెండో ఎపిసోడ్ కే సినిమా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.

దాసరి పార్వతి
కర్నూలు జిల్లా మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి వచ్చిన దాసరి పార్వతి జీ తెలుగు వారు నిర్వహిస్తున్న సరిగమప పాటల రియాలిటీ షోలో పాల్గొంది. మొదటి పాటగా రంగ్ దే సినిమా నుంచి ''ఊరంతా వెన్నెల మనసంతా చీకటి'' అంటూ మంగ్లీ తన అద్భుతమైన స్వరంతో పాడిన పాటను ఆమె మళ్లీ పాడి యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఊరికి బస్సు రప్పించమని
ఆమె పాట నచ్చడంతో సంగీత దర్శకుడు కోటి మీకు ఏమి కావాలి అని అడగడంతో ఆమె తనకు ఏమీ వద్దు కానీ ఊరికి బస్సు రప్పించమని కోరింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోటి తన ప్రయత్నం తాను చేయగా జడ్జిలలో ఒకరైన స్మిత కూడా తన ప్రయత్నం తాను చేశారు.

ఊరి పెద్దలతో చర్చించి
ఈ క్రమంలోనే స్మిత మంత్రి పేర్ని నానితో ఈ విషయం మీద సంప్రదింపులు జరుపగా ఆయన పార్వతి ఊరికి బస్సు వేసేందుకు ప్రభుత్వం తరఫున అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు బస్సు వేయడం అంటే కుదరని పని కాదు కాబట్టి వారానికి కొన్ని రోజుల పాటు ఊరి పెద్దలతో చర్చించి బస్సు వేస్తామని వెల్లడించారు.

ఊరికి బస్సు తీసుకొచ్చి
ఇది రెండో ఎపిసోడ్ లో టెలికాస్ట్ కానుంది. అలా తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ పార్వతి ఎవరూ అంటూ అందరూ ఆమె గురించి వెతుకులాట మొదలు పెట్టారు అనుకోండి అది వేరే విషయం. తాజాగా ఆమె ప్రతిభకు మరో అవకాశం దక్కింది. ఆ కార్యక్రమం రెండవ ఎపిసోడ్ కు అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తన తర్వాత సినిమాలో పాట పాడించేందుకు సంగీత దర్శకుడితో మాట్లాడతానని స్టేజ్ పై చెప్పి ఆమెకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Recommended Video

ఏకంగా సినిమా అవకాశం
ఒక రకంగా ఎవరూ ఇది ఊహించక పోవడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత పార్వతితో కలిసి కార్తికేయ రెండు స్టెప్పులు కూడా వేశాడు. ఇక కార్యక్రమానికి హాజరైన యువన్ శంకర్ రాజా కూడా పార్వతి కచ్చితంగా ఉన్నత శిఖరాలు అందుకుంటుందని పేర్కొన్నారు. వలిమైలో విలన్ గా మెరిసిన కార్తికేయ ఇచ్చిన క్రేజీ ఆఫర్ తో పార్వతి పేరు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం పార్వతి అంటూ నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అలా ఒకే దెబ్బకు సినిమాలో పాడే అవకాశం రావడం మామూలు విషయం కాదు కదా.


Click it and Unblock the Notifications











