విడుదలకు ముందే ఆచార్య సరికొత్త రికార్డ్.. భారీ రేటుకు ఆడియో రైట్స్!
ఆచార్య సినిమాపై టాలీవుడ్‌లో ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నామధ్య రిలీజ్ చేసిన టీజర్‌తో కొరటాల శివ ఓ శాంపిల్ వదిలేశాడు. సినిమా ఎలా ఉండబోతోందో లైట్‌గా అలా చెప్పేశాడు. మాస్‌కు నచ్చే.. మాస్ మెచ్చే కమర్షియల్ సినిమాగా ఆచార్య ఉండబోతోందని చెప్పకనే చెప్పేశాడు. ఇక మణిశర్మ దానికి తగ్గట్టే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేశాడని కూడా తెలుస్తోంది.

టీజర్ అలా..
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం స్పెషలిస్ట్. ఆమధ్య మణిశర్మకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అంతగా అవకాశాలు రానప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రం ఆయన్నే సంప్రదించేవారు. అలా మణిశర్మ నేపథ్య సంగీతానికి ఓ బ్రాండ్ మార్క్ ఉంటుంది. అలా ఆచార్య టీజర్‌లోనూ మణిశర్మ మార్క్ కనిపించింది.

ఆడియోపై అంచనాలు..
మామూలుగానే చిరంజీవి మణిశర్మ కాంబోకు టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆల్ టైం హిట్స్ ఎన్నో వచ్చాయి. ఎప్పటికీ నిలిచేపోయే మాస్ నంబర్స్ ఇచ్చాడు మణిశర్మ. అలాంటి మణిశర్మ మళ్లీ ఇన్నాళ్ల తరువాత చిరంజీవికి మ్యూజిక్ కొడుతున్నాడు. అందుకే ఆచార్యపై అంచనాలు అమాంతం పెరిగాయి. టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నాక మరో బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అని ఫిక్స్ అయ్యారు.

ఆడియో హక్కులు..
తాజాగా ఆదిత్య మ్యూజిక్ వారు ఓ ట్వీట్ చేశారు. ఆచార్య ఆడియో హక్కులను సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ మరో విషయం బయటకు వచ్చింది. భారీ రేటుకే ఆదిత్య మ్యూజిక్ ఆచార్య హక్కులను చేజిక్కించుకున్నట్టు టాక్.

దాదాపు నాలుగు కోట్లు..
ఆచార్య ఆడియో హక్కులను నాలుగు కోట్లు పెట్టి ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిందనే టాక్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. గతంలోనూ ఇలాంటి రూమర్లే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆదిత్య వారే అధికారికంగా ట్వీట్ చేయడంతో మరోసారి దాని విలువ హాట్ టాపిక్ అయింది.

ఇంత భారీ మొత్తంలో..
ఓ సినిమా ఆడియో హక్కుల కోసం ఇంత భారీ మొత్తంలో లావాదేవీ జరగడం ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. నాలుగు కోట్లు కేవలం ఆడియో కోసమే పెట్టడమంటే మామూలు విషయం కాదని, టాలీవుడ్‌లో ఇదే హయ్యస్ట్ రికార్డ్ అని తెలుస్తోంది. మొత్తానికి ఆచార్య విడుదలకు ముందే ఇలా హాట్ టాపిక్ అవుతోంది.
Recommended Video

విడుదలయ్యేది అప్పుడే..
మెగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్టేట్లు ఇచ్చారు. ఆచార్య టీజర్ విడుదల చేసిన కొద్ది సేపటికే మరో అప్డేట్ ఇచ్చారు. ఆచార్య వేసవి కానుకగా.. మే 13న విడుదల కాబోతోందని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు బాక్సాఫీస్ పని పట్టేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











