Singer Vani Jairam కన్నుమూత.. విషాదంలో సినిమా పరిశ్రమ.. కే విశ్వనాథ్‌తో అలాంటి అనుబంధం
భారతీయ సినిమా పరిశ్రమలో దాదాపు 5 దశాబ్దాలకుపైగా తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులకు, సినీ ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని అందించిన గాయని వాణీ జయరాం ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఫిబ్రవరి 4వ తేదీన మధ్యాహ్నం చెన్నైలో మరణించారు. ఆమె మరణంతో సినీ, సంగీత ప్రేమికులు, ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వాణి జయరాం వ్యక్తిగత, ప్రొఫెషనల్, మృతి వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

వాణి జయరాం వ్యక్తిగత జీవితం
వాణి జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె నవంబర్ 30వ తేదీ 1945 సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి అయ్యాంగర్, పద్మావతి దంపతులకు జన్మించారు. క్వీన్ మేరీస్ కాలేజీలో విద్యను అభ్యసించారు. 1971లో సినీ సంగీత ప్రపంచంలోకి అడుగపెట్టిన ఆమె కన్నడ, తమిళ, హిందీ, తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యానీ, తులు, బెంగాళీ, అస్సామీ భాషల్లో దాదాపు 20 వేలకుపైగా పాటలు పాడారు.

ముంబైలో మ్యూజిక్ కెరీర్
వాణి జయరాం పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. ముంబైలోనే బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని కొనసాగించే సమయంలో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద శిష్యరికం చేశారు. ఆ తర్వాత బ్యాంక్ ఉద్యోగం వదిలేసి మ్యూజిక్ ఫ్రొఫెషన్‌ను స్వీకరించారు. తుమ్రీ ఘజల్స్, భజనలు పాడుతూ 1969లో తొలి సంగీత కార్యక్రమాన్ని ఇచ్చారు. అదే సంవత్సరం కుమార గంధర్వతో కంపోజర్ వసంత్ దేశాయ్ రూపొందించిన ఆల్బమ్‌కు తాను పనిచేశారు.ఓపీ నయ్యర్‌తో ఖూన్ కా బద్లా ఖూన్, మహ్మద్ రఫీ, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, మన్నా డే, జైదేవ్ లాంటి ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు.

తెలుగులో పూజా చిత్రంతో
ఇక తెలుగులో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి అధ్వర్యంలో అభిమానవంతులు అనే సినిమా కోసం ఎప్పటివలే కాదురా నా స్వామి అనే పాట పాడటం ద్వారా 1973లో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. పూజా చిత్రంతో ఆమెకు అద్బుతమైన పాపులారిటీ వచ్చింది. పూజలు చేయా, ఎన్నోన్నో జన్మల బంధం అంటూ పాడిన పాటలు అమెను ప్రతీ ఇంటి గడపకు పరిచయం చేశాయి. శంకరాభరణం సినిమాలో ఏకంగా ఐదు పాటలు పాడటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సీతామహాలక్ష్మీ, శృతిలయలు, స్వాతి కిరణం లాంటి చిత్రాలు ఆమెకు ఘన కీర్తిని తెచ్చాయి.

హిందీలో మ్యూజిక్ లెజెండ్స్‌తో
హిందీ సినిమా రంగంలో పాకీజా, ఐనా, ఏక్ మట్టీ ఆస్మాన్, ఛాలియా, ధర్మ్ ఔర్ కానూన్ చిత్రాల్లో మంచి పేరును తెచ్చిపెట్టాయి. భారతీయ సినిమా పరిశ్రమలో మ్యూజిక్ లెజెండ్స్ నౌషాద్, ముఖేష్, శ్యామ్‌జీ ఘన్ శ్యామ్‌జీ, కల్యాణ్ జీ ఆనంద్ జీ అందించిన పలు సినిమాల్లో వాణి జయరాం గాయనిగా అనేక పాటలు పాడారు.

తమిళంలో మరుపురాని పాటలు
తమిళం, దక్షిణాది సినిమా పరిశ్రమలో శంకర్ గణేష్, సుబ్బయ నాయుడు, ఎంఎస్ విశ్వనాథన్, ఎస్పీ బాలసుబ్రహణ్యం, ఇళయ రాజా, కేవీ మహదేవన్, వీ కుమార్, జీకే వెంకటేష్, పీబీ శ్రీనివాస్, జేసుదాస్, ఏఆర్ రెహ్మాన్ లాంటి సినీ, సంగీత ప్రముఖులతో ఆమె పనిచేశారు. ఎన్నో మరుపురాని పాటలను ప్రేక్షకులకు అందించారు.

పద్మభూషణ్ అవార్డు స్వీకరించకుండానే..
వాణి జయరాం తన ఐదు దశాబ్దాల కెరీర్‌లో లెక్కలేనని అవార్డులు, రివార్డులు అందుకొన్నారు. పలు రాష్ట్రాలు అందించిన ఉత్తమ గాయని అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతోపాటు ఫిల్మ్‌ఫేర్ లాంటి అవార్డు అందుకొన్నారు. ఇటీవల వాణి జయరాంకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డు స్వీకరించకముందే ఆమె ఈ లోకాన్ని వదిలివెళ్లారు.


Click it and Unblock the Notifications











