Bhola Shankar: చిరంజీవి మూవీలో హింట్ సాంగ్ రీమిక్స్.. అప్పట్లో తండ్రి.. ఇప్పుడు కొడుకు
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్‌లో ఎవరూ చేయని విధంగా రాకెట్ వేగంతో సినిమాలు చేస్తోన్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇలా 'ఖైదీ నెంబర్ 150'తో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. అప్పటి నుంచి వరుసగా ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తద్వారా తన రేంజ్‌ను మరింతగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో వచ్చారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను సాధించి సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా రూపొందుతోన్న 'భోళా శంకర్' ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, గత వారంలోనే భారీ కాస్టింగ్‌తో సాగే ఓ సాంగ్‌ను కూడా కంప్లీట్ చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన 'రామ్మా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా'ను రీమిక్స్ చేస్తున్నారని తాజాగా తెలిసింది. గతంలో ఆ పాటను మణి శర్మ స్వరపరచగా.. ఇప్పుడు ఆయన కుమారుడు మహతి స్వర సాగర్ దీన్ని రీమిక్స్ చేస్తున్నాడు. ఇక, ఈ పాటను కోల్‌కతా సెట్‌లో ఇటీవలే షూట్ చేశారని సమాచారం. దీన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారని.. ఈ పాట సినిమాలోని మేజర్ హైలైట్‌లలో ఒకటిగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటిస్తోంది. అలాగే, కీర్తి సురేష్ ఆయన సోదరిగా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











