‘గడ్డి తింటావా’ అంటూ మరో బాంబ్.. వర్మ మామూలోడు కాదు!
లాక్ డౌన్ కాలంలో ఎక్కువగా డబ్బు సంపాదించిడమే కాదు వార్తల్లోనూ నిలిచిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా? షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభిద్దామా? అని అందరూ అనుకుంటూ ఉంటే ఫటా ఫట్ సినిమాలను తీస్తూ జేబులు నింపుకుంటున్నాడు వర్మ. వంద, రెండొందలు అంటూ టికెట్ రేటు ఫిక్స్ చేశాడు. అంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా ట్రైలర్‌కు కూడా ఓ రేటు పెట్టేశాడు.
అందుకే జీవుల్లో ఆర్జీవీ వేరయా అంటారు. ప్రపంచ సినీ చరిత్రలో ట్రైలర్ వీక్షించడానికి టికెట్ పెట్టిన మహానుభావుడిగా వర్మ రికార్డులు సృష్టించాడు. పవర్ స్టార్ అనే చిత్రాన్ని కేవలం వర్కింగ్ స్టిల్స్ ద్వారానే ఓ రేంజ్ పబ్లిసిటీ వచ్చేలా చేశాడు. పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా తీస్తూనే.. అలాంటిదేమీ లేదు అలా యాదృచ్చికంగా జరిగిందని బుకాస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్‌గా మరోసారి కౌంటర్ వేసినట్టుగా ఓ పాటను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

గడ్డి తింటావా అనే పాటను నేటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తానని ప్రకటించాడు. ఈ మేరకు పాట గురించి వివరిస్తూ.. 'మా హీరో తన ఫాంహౌస్‌లో ఆయన దగ్గర ఉన్న బర్రెలు, చెట్ల గురించి పాడుకుంటాడు. ట్రైలర్ జూలై 22, సినిమా జూలై 25న రిలీజ్ అవుతుంద'ని తెలిపాడు. మొత్తానికి ఆర్జీవీ బాగానే బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇక మరి ట్రైలర్‌ను ఎంత మంది వీక్షిస్తారో? ఎంత లాభం వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











