ఉప్పెనకు విజయ్ దేవరకొండ సాయం.. పాటను రిలీజ్ చేసిన రౌడీ
ప్రస్తుతం తెలుగులో రాబోతోన్న చిత్రాల్లో అందరి కన్ను ఉప్పెన సినిమాపై పడింది. మెగా హీరో డెబ్యూ సినిమాగా కంటే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత మాయాజాలమే ఎక్కువగా కనిపిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తోన్న ఉప్పెనపై మంచి అంచనాలున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతం, బాణీలతో అంచనాలు ఆకాశమంత ఎత్తులోకి తీసుకెళ్లాడు. ఒక్కో పాట విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో 'నీ కన్ను నీలి సముద్రం' 'ధక్ ధక్', 'రంగులద్దుకున్న' పాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని పాటలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మరో పాటను విడుదల చేశాడు. జల జల జలపాతం అనే ఈ పాట ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది.

శ్రీమణి సాహిత్యం, జస్ప్రీత్ జాజ్ - శ్రేయా ఘోషాల్ గానం, దేవిశ్రీ అద్భుతమైన మెలోడీ ట్యూన్ ఇలా అన్ని కలిపి ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇప్పటికే విడుదలైన 'ఉప్పెన' టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఉప్పెన ఫిబ్రవరి 12న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల సత్తా ఏంటో అందరికీ తెలిసిపోనుంది. ఆల్రెడీ మొదటి సినిమా విడుదల కాకుండానే రెండో ప్రాజెక్ట్‌ను కూడా వైష్ణవ్ తేజ్ పూర్తి చేసేశాడు.


Click it and Unblock the Notifications











