మాస్ స్టెప్పుతో విజయ్ సాలిడ్ రికార్డ్: సౌతిండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఘనత
పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో ఇళయదళపతి విజయ్. కొంత కాలంగా వరుస హిట్లను అందుకుంటూ హవాను చూపిస్తోన్న అతడు.. ఈ ఏడాది ఆరంభంలో 'మాస్టర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ దీన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్మ దులిపేసింది. దీంతో ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది.
విజయ్ నటించిన 'మాస్టర్' మూవీకి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక, ఇందులో 'వాతీ కమింగ్' అనే మాస్ సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇది విడుదలై దాదాపు ఐదు నెలలు అవుతున్నా యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాటకు మూడు లక్షల అరవై వేళ లైకులు వచ్చాయి. దీంతో సౌతిండియా రికార్డు నమోదైంది. రెండో స్థానంలో 'బుట్టబొమ్మ' పాటకు 3 లక్షల కామెంట్లు, 'రౌడీ బేబీ' సాంగ్‌కు రెండు లక్షల అరవై వేల కామెంట్లు వచ్చాయి.

ఇక, వ్యూస్‌లోనూ 'వాతీ కమింగ్' సాంగ్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 225 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, 2.4 మిలియన్ల లైకులు కూడా దక్కాయి. దీంతో ఈ పాటు యూట్యూబ్‌లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇక, ఈ సినిమాలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. వీళ్లిద్దరి మధ్య పోరును దర్శకుడు లోకేష్ అద్భుతంగా చిత్రీకరించాడు. ఇక, ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. మాలవిక మోహనన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా కీలక పాత్రను పోషించింది


Click it and Unblock the Notifications











