ఆ రోజున దిల్‌రాజుతో గొడవ, చివరికి కాళ్లు పట్టేసుకున్న డైరెక్టర్!
తెలుగు చలనచిత్ర చరిత్రలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో మరపురాని సినిమా ఆర్య. ప్రేమకథల్లో అప్పటి వరకు రాని ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా బన్నీ మెస్మరైజింగ్ యాక్టింగ్, డైలాగ్స్, పాటలు, సుకుమార్ టేకింగ్ అన్నీ కలిసి సినిమాను తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి. మంగళవారం ఆర్య రిలీజై సరిగ్గా 20 ఏళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా ఆర్య మూవీ యూనిట్ రీ యూనియన్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఆర్య సినిమా తమ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో యూనిట్ సభ్యులు పంచుకున్నారు.
అలానే తనకు-దిల్‌రాజు మధ్య చోటు చేసుకున్న గొడవ గురించి సుకుమార్ వివరించారు. కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడే రోజుల్లో దిల్‌రాజు తనకు అవకాశం కల్పించారని ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటానన్నారు. ఆర్య షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అది సినిమాకు సంబంధించినదేనని సుకుమార్ వెల్లడించారు.

సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే సమయం వుందని.. డబ్బింగ్, మిక్సింగ్ పనులు జరుగుతున్నాయని.. ఇలాంటి దశలో మాంటేజ్ సాంగ్ తీయాలని సుకుమార్ చెప్పారట. అయితే సినిమా అంతా అయిపోయాక మళ్లీ షూటింగ్ ఏంటీ అని దిల్‌రాజు ఒప్పుకోలేదట.
అది మూవీలో ఎంతో కీలకమైనదని దిల్‌రాజుకు చెప్పానని.. అయితే ఈ సన్నివేశం వల్ల బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశం వుందని ఆయన ఒప్పుకోలేదని సుకుమార్ తెలిపారు. ఇద్దరం తగ్గకపోవడంతో మాటా మాటా పెరిగిందని.. మీరు మీరు స్థాయి నుంచి నువ్వు నువ్వు అనే దాకా వెళ్లిపోయామన్నారు. గొడవ పెద్దదవుతుందన్న దశలో సడెన్‌గా దిల్‌రాజు కాళ్లు పట్టేసుకున్నానని తెలిపారు.
ఆర్య మూవీలో ఈ సీన్ సినిమాకు ప్రాణం లాంటిదని, అది లేకుండా మూవీ కష్టమని ప్రాధేయపడ్డానని సుకుమార్ గుర్తుచేసుకున్నారు. చివరికి దిల్‌రాజు ఓకే చేయడం, సరిగ్గా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాంటేజ్ సాంగ్ తీసి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

సుకుమార్, నేను కెరీర్ ఒకే సమయంలో ప్రారంభించామని .. ఇద్దరం కలిసి ఒకటే రూంలో వుండేవాళ్లమని దిల్‌రాజు తెలిపారు. 1000 రూపాయలు కలిసొస్తుందని కూడా అప్పట్లో ఆలోచించేవాడినని .. ఆర్య రిలీజై 20 ఏళ్లు గడిచిపోయిందని, ఈ సినిమాకు పనిచేసినవాళ్లంతా కెరీర్‌లో ఎక్కడికో వెళ్లిపోయారని దిల్‌రాజు ప్రశంసించారు. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో అవమనాలు, కష్టాలు పడి, ఎన్నో పస్తులుండి ఇక్కడి వరకు వచ్చామని సుకుమార్ గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఎంతో రాజీపడితేనే ఇవన్నీ సాధ్యమవుతాయని.. కొత్తగా వచ్చే దర్శకులు ఇవన్నీ గుర్తుంచుకోవాలని సుక్కూ మాస్టర్ సూచించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గంగోత్రితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయానని ఏడాదిపాటు ఖాళీగానే వున్నానని తెలిపారు. రోజుకు మూడు కథలు వింటున్నా ఏవీ నచ్చలేదని.. సరిగ్గా ఆ సమయంలో దిల్ సినిమా ప్రీమియర్ వేస్తే అక్కడికి వెళ్లగా సుకుమార్ నన్ను చూసి ఆర్య కథ చెప్పారని బన్నీ పేర్కొన్నారు. అంతా కొత్తవాళ్లం కావడంతో దీనిని తెరకెక్కించడానికి ఎన్నో కష్టాలు పడ్డామని.. ఆ సమయంలో వివి వినాయక్ ఎంతో సపోర్ట్‌గా నిలిచారని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నారు.
ఆర్య రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత చిరంజీవిగారి చేతుల మీదుగా 125 రోజుల షీల్డ్ తీసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని దిల్‌రాజు - సుకుమార్ లేకపోతే ఆర్య లేదని, ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని బన్నీ ముగించారు.


Click it and Unblock the Notifications











