2019 ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌కు ఊహించని షాక్
దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పోటీ పడిన పలువురు సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో సినీ నటులు సుమలత, ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రోజా, నాగబాబు, శతృఘ్న సిన్హా, రవికిషన్, ఉర్మిలా మతోంద్కర్, సృతి ఇరానీ తదితరులు పోటీ చేశారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఫలితాల పరిస్థితి ఇలా ఉంది.

పవన్ కల్యాణ్ వెనుకంజ
కాగా కడపటి వార్తలు అందేసరికి భీమవరం, గాజువాకలో పవన్ కల్యాణ్, వెనకంజలో ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో నిర్ణాయక శక్తి మారుతారనే పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో వెనుకంజలో ఉండటం అభిమానులకు నిరాశను కలిగిస్తున్నది.

నమ్మకం కలిగించలేని సినీ నటుడు ప్రకాశ్ రాజ్
సామాజిక అంశాలపై పోరాటం చేస్తూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయారనేది ప్రాథమికంగా స్పష్టమవుతున్నది. ధనం, అధికార ప్రభావం లేని స్వచ్ఛమైన పాలిటిక్స్ కోసం పోరాటం చేస్తానన్న ప్రకాశ్ రాజ్ ఓటర్లపై ప్రభావం చూపలేకపోయారనేది ప్రారంభం ఎన్నికల లెక్కింపులో స్పష్టమైంది.

గెలుపు దిశగా టీవీ నటి సృతి ఇరానీ
ఇక టెలివిజన్ నటి, రాజకీయ వేత్త సృతి ఇరాని విజయం వైపు దూసుకెళ్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఆమేథీలో రాహుల్ గాంధీపై ఆరంభంలో పై చేయి సాధించింది. భావి ప్రధానిగా పేరు పొందిన రాహుల్‌పై సృతి ఇరానీ అధిక్యం ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అధిక్యంలో బాలకృష్ణ
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సినీ నటుడు బాలకృష్ణ అధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ బాలకృష్ణ ఇదే స్థానం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నగరిలో రోజా హవా
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో సినీ నటి రోజా విజయం వైపు దూసుకెళ్తున్నది. గత ఎన్నికల్లో కూడా రోజా ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. తుది ఎన్నికల కౌంటింగ్ ముగిసే సమయానికి రోజా విజయం సాధిస్తుందా లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











