రాజమౌళికి సల్మాన్ ఖాన్, అలియా భట్ షాక్.. ఎవరు తప్పుకుంటారు!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని రాజమౌళి స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కల్పిత గాధగా తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ తేదీ కోసం ఇప్పుడు భారీ పోటీ నెలకొని ఉంది.

బాలీవుడ్ నటులతో
ఆర్ఆర్ఆర్ చిత్రం నార్త్ ఇండియాలో కూడా కొంత కథ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి బాలీవుడ్ నటుల్ని ఎంపిక చేసుకున్నారు. రాంచరణ్ కు జోడిగా అలియాభట్ నటిస్తోంది. స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. మరికొందరు బాలీవుడ్ నటులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి చిత్రంతోనే రాజమౌళికి బాలీవుడ్ లో తిరుగులేని మార్కెట్ ఏర్పడింది.

క్రేజీ కాంబినేషన్
నార్త్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సల్మాన్ ఖాన్ ఎక్కువగా తన చిత్రాలని రంజాన్ సందర్భంగా విడుదల చేస్తుంటాడు. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ దర్శకుడు. దాదాపు 19 ఏళ్ల తర్వాత సల్మాన్, భన్సాలీ కాంబినేషన్ లో చిత్రానికి ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గా నటించనుంది. భన్సాలీ గురించి తెలిసిందే. ప్రతి చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తారు.

షాకిచ్చిన సల్మాన్
త్వరలో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ చిత్రం గురించి సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని 2020 రంజాన్‌కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సల్మాన్ ప్రకటించాడు. రంజాన్ 2020లో జులై 30నే వస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదుల కూడా అప్పుడే. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదలైతే ఇద్దరికీ నష్టమే. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు తమ చిత్రాన్ని వాయిదా వేసుకోక తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అక్షయ్ కుమార్ కూడా
రోహిత్ శెట్టి దర్శత్వంలో అక్షయ్ కుమార్ నటించే సూర్యవంశి చిత్రాన్ని కూడా 2020 జులై 30నే విడుదుల చేయనునట్లు ప్రకటించారు. దీనితో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం బాలీవుడ్ చిత్రాల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొనబోతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం పుణేలో భారీ షెడ్యూల్ కు సిద్ధం అవుతోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య రాజమౌళి కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.


Click it and Unblock the Notifications











