తెలుగు ప్రేక్షకుల కోసం నాగార్జున ప్రయత్నం.. ఆ అపూర్వ ఘట్టానికి వెండితెర రూపం
సీనియర్ హీరో నాగార్జున తెలుగు ప్రేక్షకుల కోసం ఓ చిరు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించే ఆయన.. ప్రేక్షకులందరికీ అవసరమయ్యే ఓ బాలీవుడ్ సినిమాను తన బ్యానర్‌పై తెలుగులో అందిస్తున్నారు. బాలీవుడ్ మూవీ 83 తెలుగు వర్షన్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇండియన్ క్రికెట్ చరిత్రలో 1983 వరల్డ్ కప్ సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దేశమంతా గర్వించేలా ప్రపంచ కప్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎల్లలు దాటించారు అప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్ దేవ్. ఈయన నాయకత్వంలో ఇండియా చిరకాల స్వప్నం సాకారమైంది. అయితే ఈ అపూర్వ ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ 83 పేరుతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్ డైరెక్టర్ కబీర్‌ఖాన్.
కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున తెలుగులో అందించబోతున్నారు.

ఈ సందర్బంగా నాగార్జున స్పందిస్తూ.. ''క్రికెట్ హిస్టరీలోనే 1983లో మన దేశం గొప్ప విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో మన దేశంలో క్రికెట్ అందరి జీవితాల్లో మమేకమై పోయింది. ఈ వరల్డ్ కప్ గొప్పతనాన్ని తెలిపే చిత్రమే 83. ఈ చారిత్రక జర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమాను మా సంస్థ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











