మగతనాన్ని నిరూపించుకోండి..తమ్మారెడ్డి భరద్వాజకు లేఖ
'టాలీవుడ్ హీరోలు మగాళ్లు కారు' అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ప్రకటన ఇంకా టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇలా ప్రకటించటం పద్దతి కాదంటూ ఎ.పి. సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒ.కళ్యాణ్ తప్పుపట్టారు.ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేసారు. ఆ లేఖలో తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల మగతనం గురించి మాట్లాడే ముందు భరద్వాజ్ తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే 'తారే జమీన్ పర్' వంటి చిత్రాన్ని తెలుగులో తీయాలనుకుంటే ఒప్పుకునే హీరోలు ఉన్నారా అని భరద్వాజ్ వేసిన ప్రశ్నను ప్రస్తావిస్తూ ఘాటు ప్రశ్నలు వేసారు.
'ఇటువంటి కథతో ఏ తెలుగు హీరోనైనా కలిశారా, కలిస్తే వారు చేయమని తిరస్కరించారా? అలాంటి కథ మీ దగ్గరుంటే మీరే కొత్తవారితో సినిమా తీసి మీ మగతనాన్ని నిరూపించుకునే సత్తా వుందా' అని ఆ లేఖలో ప్రశ్నించారు కళ్యాణ్. 'కుటుంబ సంబంధాలు, నలుగురితో మంచిగా ఉంటూ సమాజశ్రేయస్సు కోరే 'ఆ నలుగురు', 'నేటి సమాజంలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని ఆలోచింపచేసే విధంగా తీసిని 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాలు కానీ, ఆ సినిమాలు చేసిన హీరోలు కానీ మీ దృష్టికి రాలేదా' అని భరద్వాజ్‌ను సూటిగా ప్రశ్నించారు కళ్యాణ్. ఘాటయిన పదజాలంతో ఉన్న ఈ బహిరంగ లేఖను పత్రికల వారికి విడుదల చేశారు ఒ.కళ్యాణ్.ఈ లేఖ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications