twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మలమ్మకు నివాళి

    By Staff
    |

    Nirmalamma
    తెలుగు సినిమా పరిశ్రమతో చిరకాల అనుబంధం ఉన్న నిర్మలమ్మ సెలవంటూ వెళ్ళిపోయింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని స్వగృహంలో నిర్మలమ్మ గురువారం ఉదయం కన్నుమూశారు. తెలుగు చలనచిత్ర సీమతో ఐదు దశాబ్ధాల తన అనుబంధాన్ని తెంచుకుని సెలవంటూ వెళ్ళిపోయారు. తెలుగు ప్రేక్షకులకు బామ్మగా సుపరిచితమైన నిర్మలమ్మ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. నిర్మలమ్మ మరణవార్త తెలిసిన యావత్‌ తెలుగుచిత్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నిర్మలమ్మ భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించారు.

    1925లో కృష్ణా జిల్లాలోని బందర్‌లో జన్మించిన నిర్మలమ్మ పదేళ్ళ వయసు నుంచే నటన పట్ల మక్కువ చూపారు. స్వతహ సిద్ధంగా అబ్బిన నటనకు పదును పెట్టుకోవడానికి నాటకాలలో చేరారు. మహామహులతో కలిసి ఎన్నో నాటకాలను, లెక్కకు మిక్కిలి పాత్రలను తనదైన శైలిలో పోషించారు. 1940 నాటికే నిర్మల నటనా పటిమ సరిహద్దులు దాటింది.అది అప్పుడప్పుడే చిత్రకళ ఫరిడవిల్లుతున్న తరుణం. ఆ సమయంలోనే బానుమతి హీరోయిన్‌గా నటిస్తున్న గరుడ గర్వభంగం (1943) అనే చిత్రంలో నిర్మలమ్మకు వెండితెరపై నటించే తొలి అవకాశం లభించింది. ఆ చిత్రంలో భానుమతి చెలికత్తెగా నిర్మలమ్మ నటించారు. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలలో నిర్మల నటిన భానుమతిని డామినేట్‌ చేస్తుంది.

    ఈ చిత్రం తరువాత మళ్ళీ నిర్మలకు అవకాశాలు రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సంక్షోభ ప్రభావం పరిశ్రమపై తాండవిస్తూ ఉండడంతో చేసేది లేక నిర్మలమ్మ తిరిగి కృష్ణా జిల్లా వెళ్ళిపోయారు. తనకు ఇష్టమైన నాటకాల్లో నటించడం మాత్రం ఆపలేదు. అయితే అనుకోకుండా పదహారు సంవత్సరాల తర్వాత మళ్శీ సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.తదనంతర కాలంలో సినీ ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని నిర్మల పెళ్ళాడారు. ఆయనకు 1958లో ఆడపెత్తనం అనే సినిమాకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా అవకాశం వచ్చింది. ఇక్కడే నిర్మల నట జీవితం మలుపు తిరిగింది. ఆ సినిమాలో చిన్న పాత్ర పోషించిన నిర్మలమ్మ, తర్వాత ఎన్టీఆర్‌ సరసన కాడెద్దులు-ఎకరం నేల వంటి సినిమాల్లో నటించారు.

    అయితే నిర్మల హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఘోరాతి ఘోరమైన పరాజయం చవిచూశాయి. దీనితో నిర్మల క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే పరిమితం కావలసి వచ్చింది. ఓపక్క సినిమాలలో నటిస్తూనే నంది నాటకోత్సవాల్లో పాల్గొనేవారు. వరుసగా మూడేళ్ళు ఉత్తమ హీరోయిన్‌గా బంగారు నందులు గెలుచుకుని తనకు సాటిలేరని చాటిన నటీ'మణి' నిర్మలమ్మ. నంది నాటకోత్సవాల్లో నాలుగో ఏడాది నిర్వాహకుల కోరిక మేరకు ఆవిడ స్వచ్ఛందంగా పాల్గొనడం మాని ప్రేక్షకుల గ్యాలరీకే పరిమితమయ్యారు. కొత్త వారికి అవకాశం లభిస్తుందనే తాను నాటకాల పోటీలలో నటించడం మానుకున్నానని చెప్పేవారు నిర్మలమ్మ. అంతటి తిరుగులేని నటీమణి తన సాత్విక నటనతో చిత్రరంగంపై ప్రత్యేక ముద్ర వేశారు.

    వందల కొద్దీ సినిమాల్లో బామ్మ పాత్రను పోషించినా తెలుగు సినీ ప్రేక్షకులు నిర్మలమ్మ నటనను నిత్యనూతనంగానే స్వీకరించారు. 1985లో మయూరి, 1999లో సీతారామరాజు చిత్రాలకు నిర్మలమ్మ ఉత్తమ క్యారెక్టర్‌ నటిగా నంది అవార్డులు అందుకున్నారు. ఇక నాటక విశిష్ట పురస్కారాలు, సన్మానాలు, ప్రశంసలు, అవార్డులకు లెక్కలేదు, సంఖ్యా తెలీదు. నిర్మలమ్మ చివరిచిత్రం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ప్రేమకు స్వాగతం. నిర్మలమ్మకు సంతానం లేకపోవడంతో కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. కవిత పెళ్ళి చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు. నటనాదాహం తీరకపోయినా అనారోగ్యం సహకరించకపోవడంతోనే సినీ రంగాన్ని ఇష్టం లేకపోయినా వీడానిని చెప్పేవారు నిర్మలమ్మ.

    అల్లూ రామలింగయ్య, రాజబాబు, రేలంగి, సావిత్రి, ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ మొదలుకొని ఎంతో మంది ఉద్ధండుల సరసన నటించిన అరుదైన అవకాశం నిర్మల సొంతం. తరాల వారధిగా, చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా పేరొందిన నిర్మలమ్మ మృతి నిజంగా చిత్ర పరిశ్రమకు తీరని లోటు. నిర్మలమ్మ లేకపోయినా చిత్రాలలో ఆమె నటన సజీవంగానే ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X