కల నెరవేరింది: త్రివిక్రమ్ ఎన్టీఆర్ సమేత... బాలకృష్ణ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగులో తాజాగా యాక్టర్ ఆదర్శ్ బాలకృష్ణ కూడా జాయిన్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ ఆ ఇద్దరు స్టార్లతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అతిధి పాత్రలో నటిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని తన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ మొదటి సీజన్లో ఆదర్శ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆదర్శ్ ఎన్టీఆర్‌కు మరింత దగ్గరయ్యారు. ఎన్టీఆర్ చూపే ప్రేమకు ఫిదా అయ్యానని గతంలో ఆదర్శ్ బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.
ఓ వైపు తన అభిమాన నటుడు, మరో వైపు తన అభిమాన దర్శకుడు... ఈ ఇద్దరితో కలిసి నటించే అవకాశం రావడంతో ఆదర్శ్ మరింత హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రంలో అతడిది చిన్న పాత్రే అయినా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

సినిమా విషయానికొస్తే... ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.ఎన్టీఆర్ ఈ చిత్రంలో స్లిమ్ లుక్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంటుగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తైపోతుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా ఫినిష్ చేసి అక్టోబర్ లో సినిమాని విడుదుల చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











