ఇలా విచిత్రంగా ఉన్నా ఆయన కూడా హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాడా అని తన చిన్నతనంలో బిగ్‌బీ అమితాబ్ ఫొటోలను చూసి జాలిపడినట్లు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వెల్లడించారు. 'సినీ పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చినందున మా ఇంట్లో ఫిలింఫేర్ లాంటి మేగజీన్‌లకు కొదవలేదు. చిత్రపరిశ్రమలో కాలుమోపేందుకు యువకులు పడే తపన చూసి చిన్నతనంలో నవ్వుకునే వాడిని. మేగజీన్‌లో ఇలాంటి వాటిని ప్రచురించేవారు. 1970లో ఓసారి పుస్తకంలో అమితాబ్ ఫొటోను చూసి జాలిపడ్డాను. చివరకు ఇలాంటి వ్యక్తి కూడా నటుడు కావాలని ప్రయత్నిస్తున్నాడు అని సాటి స్నేహితులు, పనిమనుషులతో వ్యాఖ్యానించాను. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా మాటలకు సిగ్గుతో తలదించుకుంటాను' అని అమీర్ చెప్పారు. పాత్రికేయుడు భావనా సోమయ్య అమితాబ్‌పై రచించిన 'బచ్చనాలియా' పుస్తకాన్ని శనివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అమితాబ్ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో మధుర ఘట్టాలను ఇందులో పొందుపరిచారు.