హిట్ అర్థం కోట్లు కలెక్టు చేయటం కాదు
ముంబై: ''ఇటీవల బాలీవుడ్‌లో రూ.వంద కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాల గురించే ఎక్కువగా చర్చించుకొంటున్నారు. అందులోనూ ఏ చిత్రం అతి తక్కువ సమయంలో ఆ మార్కు చేరుకొంది? అనేది కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే నిజమైన విజయానికి వసూళ్లు కొలమానం కాదనేది నా అభిప్రాయం'' అంటున్నారు ప్రముఖ నటుడు అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ''నేను నటించిన 'త్రీ ఇడియట్స్', 'గజిని', 'ఫనా' చిత్రాలు రూ.వంద కోట్ల మార్కును చేరిన సంగతి తెలిసిందే. అయితే వసూళ్లను చూపించి ఆ సినిమాలు విజయం సాధించాయంటే నేను ఒప్పుకోను. పదిమంది సినిమా చూసి ఎనిమిది మందే బాగుందంటే ఆ సినిమాకు ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చినా విలువ లేదు. అదే పదిమందిలో తొమ్మిది లేదా పదిమంది బాగుందని కితాబిస్తే... ఆ సినిమాకు వసూళ్లు తగ్గినా నా దృష్టిలో అది విజయం సాధించినట్లే'' అన్నారు.
అలాగే అంకెల గారడీని నేను అస్సలు నమ్మను అందులో కొంత మాయాజాలం కూడా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే... ఏదైనా సినిమాలో స్టార్ హీరో ఉన్నాడంటే ప్రేక్షకులు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి వారం చూస్తుంటారు. దానివల్ల కూడా వసూళ్లు వస్తాయి. అంతమాత్రాన అది విజయం కాదు కదా! ఒక సినిమా విజయం సాధించిందంటే క్రెడిట్ అంతా నటీనటులకే వెళ్లిపోతోంది. అది కూడా తప్పు. సినిమా నిర్మాణం అనేది సమష్టికృషి. అందరి సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'తలాష్'. ఈచిత్రాన్ని రీమా కాగ్టి డైరెక్ట్ చేస్తున్నారు. రితేష్ సింధ్వానీ, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్ ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30న విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











