చిరంజీవి కనిపించగానే పరుగెత్తుకెళ్లిన అమీర్ ఖాన్, ఇంట్రెస్టింగ్ ట్వీట్!
మీకు ఇష్టమైన, మీరు బాగా అభిమానించే సినీ స్టార్ అనుకోకుండా ఎయిర్‌పోర్టులో ఎదురు పడితే? అదొక అద్భుతమైన ఫీలింగ్.. వెంటనే వారితో ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇదే పని చేశారు. ఆయనకు ఎదురుపడ్డ స్టార్ మరెవరో కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.
చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ సైతం ఏదో పని మీద జపాన్ వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆయనకు చిరంజీవి ఎదురు పడటంతో ఆయనతో సెల్ఫీ తీసుకుని అభిమానులతో పంచుకున్నారు.

ఆయన కనిపించగానే ఆశ్చర్యపోయా
‘‘క్యోటో విమానాశ్రయంలో నా అభిమాన నటడు చిరంజీవిగారు కనిపించగానే ఆశ్చర్యానికి గోనయ్యాను. వెంటనే పరుగెత్తుకుంటూ ఆయన వద్దకు వెళ్లాను. చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ను ఇలా కలవాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు'' అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.
సార్.. మీరు మాకు ఎప్పుడూ ప్రేరణే
‘‘చిరంజీవిగారు ఫ్రీడం ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ‘సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి అడిగి తెలుసుకున్నాను. సార్.. మీరు మాకు ఎప్పుడూ ప్రేరణగా ఉంటూనే ఉన్నారు.'' అని అమీర్ ట్వీట్ చేశారు.

సైరా నరిసంహారెడ్డి
‘సైరా నరసింహారెడ్డి' సినిమా విషయానికొస్తే... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ రాబోయే దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ తన తర్వాతి మూవీలో లాల్ సింగ్ ఛద్దా పాత్ర కోసం సిద్ధం అవుతున్నాడు. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్' అనే చిత్రం ఆధారంగా దీన్ని రూపొందించబోతున్నారు. ఈ పాత్ర కోసం అమీర్ ఖాన్ 20 కేజీల బరువు తగ్గారు. అమీర్ ఖాన్ నటించిన చివరి చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' గతేడాది దీపావళి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











