నా కూతురేమైనా వస్తువా..?: అభిషేక్
ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ల కూతురు 'ఆరాధ్య'ను ఇప్పటి వరకు మీడియాకు చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఒక వేళ బయటకు వచ్చినా ఆమె మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్‌కు ఓ ప్రశ్న సంధించగా..... ప్రదర్శనకు పెట్టడానికి నాకూతురేమీ వస్తువు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో.
మీ కూతుర్ని ఇంత కాలమైనా భారతీయ మీడియాకు చూపించలేదు. అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్‌ను అంతర్జాతీయ మీడియా ద్వారా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారా? అని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు అభిషేక్.
ఆరాధ్యది చాలా చిన్న బాడీ, ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. అప్పుడే ఫోటో షూట్లు అంటూ ఆ చిన్ని మనసును ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. ఆమె ఫోటోలతో బిజినెస్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని స్పష్టం చేశారు అభిషేక్. సమయం వచ్చినప్పుడు ఆమెను అందరూ చూస్తారని చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా తన కూతురుతోనే ఎక్కువ సమయం గడుపుతానని చెప్పుకొచ్చారు.
ఇక పోతే... పుట్టుకతోనే ఆరాధ్య లగ్జరీ కారుకు ఓనరైంది. ఆరాధ్య కోసం అభిషేక్ బచ్చన్ ఓ ఖరీదైన లగ్జరీ కారు 'ఆడి ఏ8'ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. అమితాబ్ కుటుంబానికి 'A' అనే అక్షరం బాగా కలిసి వచ్చినట్లుంది. అమితాబ్, అభిషేక్, ఐశ్యర్వ, ఆరాధ్య ఇలా వీరందరి పేర్లు కూడా ఏ అనే అక్షరంతోనే ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఆరాధ్యకు పేరు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని అభిషేకే A అక్షరంతో మొదలయ్యే ఆడి ఏ8 కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











