'అభినందన' నిర్మాత ఆర్.వి.రమణమూర్తి కన్నుమూత

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం', 'రంగులలో కలవో యద పొంగులలో కళవో', 'ఈ ప్రశాంత విశాల ఏకాంతంలో నిదిరించుము ఓ జహాపనా' వంటి పాటలు వినగానే మనకు గుర్తొచ్చే చిత్రాలు అభినందన, నీరాజనం. ఈ రెండు చిత్రాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాత ఆర్.వి.రమణమూర్తి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన ఇటీవల 'శ్రీ సాయి మహిమ' చిత్రాన్ని నిర్మించారు. ఇళయరాజాతో అన్ని సూపర్‌హిట్ పాటలు తీసుకున్న ఆయన తొలిసారిగా బాలీవుడ్ సంగీత దర్శకుడు ఒ.పి.నయ్యర్‌ను తెలుగులో పరిచయం చేశారు. మంచి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమవ్వడం విషాదమని పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 3 గం.లకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఆర్వీ రమణమూర్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలుకా మురమండలో 1937 మార్చి 30న జన్మించారు. ఆయన పూర్తి పేరు రాయవరపు వెంకటరమణ మూర్తి. జంటనగరాల్లో తొలినాళ్ల కళాసంస్థల స్థాపకుల్లో ఒకరైన ఆయన ఏపీ కళావేదికను స్థాపించి అనేక సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహించారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడు రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా ఆయనను నియమించారు. మాజీ ప్రధాని పీవీకి బంధువైన ఆయనకు పలువురు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు ఉన్నా యి.
లతామంగేష్కర్, ఆశాబోంస్లే, ఓపీ నయ్యర్ వంటి సంగీత ప్రముఖులతో మ్యూజికల్ నైట్లను పద్మవిభూషణ్‌బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరసియా, ఎల్ సుబ్రమణ్యం వంటి మేటి విద్వాంసులతో కచేరీలనూ నిర్వహించారు. 2011లో కాలేయ మార్పిడి జరిగిన ఆయనకు 2012లో హృద్రోగానికి గురవడంతో స్టెంట్ వేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నటి జమున, మాజీ ఎంపీ పి.వి.రాజేశ్వర్‌రావు, రోశయ్య తనయుడు శివ ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.


Click it and Unblock the Notifications











