'హృదయకాలేయం' దర్శకుడు గురించి...
హైదరాబాద్: సంపూర్ణేశ్‌బాబు హీరోగా రూపొందిన 'హృదయ కాలేయం' చిత్రం సెన్సార్ సహా నిర్మాణ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అమృత క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య కుమార్, ఇషికాసింగ్ హీరోయిన్స్. రీసెంట్ గా ఆడియో రిలీజైన ఈ చిత్రం యూ ట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమా టీజర్ యూట్యూబ్‌లో పదిలక్షల వ్యూస్‌కు చేరువై సంచలనం రేపుతోంది. ఇంతకీ ఈ చిత్రం దర్శకుడు ఎవరు...స్టీవెన్ శంకర్ అనేది అతని అసలు పేరేనా అంటే కాదు అని చెప్తున్నారు. ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడారు.

దర్శకుడు మాట్లాడుతూ... "నిజానికి ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు నా పేరు స్టీవెన్‌శంకర్ కాదు. అసలుపేరు సాయిరాజేష్. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, తమిళడైరెక్టర్ శంకర్ పేర్లను కలిపి అలా పెట్టుకున్నానంతే! ఆమాటకొస్తే సంపూర్ణేష్‌బాబుదీ ఆ పేరు కాదు. అసలు పేరును అతను చెప్పొద్దు అంటున్నాడు కాబట్టి నేను చెప్పడం లేదు. మాది నెల్లూరు జిల్లా. సినిమాల మీద పిచ్చితో హైదరాబాదుకు వచ్చాను. బతుకుదెరువు కోసం ఒక సినిమావెబ్‌సైట్‌ను నడిపేవాణ్ణి. విదేశాల్లోని తెలుగు సినీఅభిమానులతో చాటింగులు చేయడం, ఫేస్‌బుక్‌లో పలకరించుకోవడం ఇదే నా పని. పది లక్షలతో సినిమా తీయాలన్నది నా లక్ష్యం. యూట్యూబ్ ద్వారా మూడు లక్షలు వస్తే, శాటిలైట్‌రైట్స్ ద్వారా మరో ఏడు లక్షలు వస్తుందన్నది నా ఆలోచన..'' అన్నారు స్టీవెన్.
ఇక సినిమా హీరో ఎంపిక గురించి చెప్తూ... "హీరో అవ్వడానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండకూడదు. ఫిజికల్ ఫీచర్స్ కూడా హీరోకు ఉన్నట్లు ఉండకూడదు. అయితే- టాలెంట్‌వైజ్‌గా హీరో ఏం చేస్తాడో అది చెయ్యగలగాలి. అలాంటి విచిత్రమైన హీరో కోసం వెదికాను. ఎక్కడా దొరకలేదు. ప్రసాద్‌ల్యాబ్‌లో ఏదో ప్రివ్యూ వేస్తుంటే చూద్దామని ఒక రోజున వెళితే - అక్కడ కనిపించాడు ఈ హీరో. రంగురంగుల బొమ్మలతో బిగుతుగా ఉండే ఎర్రటి టీషర్టు తొడుక్కుని చేతులు కాళ్లను విసురుకుంటూ నడుస్తూ వచ్చాడు. అతని వాలకం చూసిన క్షణమే 'దొరికాడ్రా నాకు హీరో' అనుకున్నాను..'' చెప్పాడు స్టీవెన్‌శంకర్.

తన మనసులోని మాటను సంపూర్ణేష్‌తో చెప్పగానే "నేను హీరోగా చేయడమేంటి సార్. సినిమాల్లో ఏదో చిన్నాచితక పాత్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. హీరోగా చేస్తే నన్నెవడు చూస్తాడు? మీరు జోక్ చేస్తున్నారు'' అని స్టీవెన్‌తో చెప్పాడు సంపు. "లేదు లేదు. నీలాంటి వాళ్లకు సూటయ్యే కథను తయారుచేసుకుని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇక ఆలోచించేది ఏమీ లేదు. నా సినిమాకు నువ్వే హీరోవు'' అన్నాడు స్టీవెన్. నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. నైజాం, గుంటూరు ఏరియాల్లో ఆయన ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











