నాగార్జున ‘రాజన్న’ కథేంటి
నాగార్జున తాజా చిత్రం 'రాజన్న'ఈ నెల 23న విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున రాజన్నగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన యధార్ధ గాథ ఆధారంగా తీస్తున్నారు. రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే కథ ఇది. బడుగు, బలహీన వర్గాల ప్రజలపై రజాకారులు సాగించిన అన్యాయాలు, దౌర్జన్యాలపై తిరుగుబాటు చేసి, ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాడు రాజన్న. తను ఒక విప్లవకారుడు. రాజన్న పోరాటం రజాకార్లు, దొరలపైన మాత్రమే కాదు.. ప్రతి అన్యాయంపైన. ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు. నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కథ ఇది.
ఇక రాజన్నకు మల్లమ్మ అనే కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి తన స్వేచ్ఛ కోసం పాటుపడే కథ ఇది. ఈ సినిమాలో రాజన్న కథ ఎంత ముఖ్యమో ఈ మల్లమ్మ కథ కూడా అంతే ముఖ్యం. మల్లమ్మగా 'అని' అనే పాప యాక్ట్ చేసింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆ పాప కనబర్చిన నటన ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తుందనే నమ్మకంగా ఉన్నారు నాగార్జున. అలాగే ఈ చిత్రంలో దాదాపు 13 పాటలుంటాయి. పాటలన్నీ కూడా కథానుసారం సాగుతాయి. కొన్ని రియల్ సాంగ్స్‌ని వాడారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలను విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











