ఆ 'కొరత' తీరిన ఎన్టీఆర్
ప్రతిభావంతులైన కథారచయితలు, దర్శకులు ఉత్సాహంగా ముందుకు రావడం వల్ల పెద్ద యువ హీరోలకు కథల కొరత తీరినట్టు కన్పిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కైతే చిన్న వయసులోనే పెద్ద ఇమేజ్ రావడంతో అనతి కాలంలోనే ఆయనకు కథల కొరత ఏర్పడింది. ఇమేజ్ కు తగిన కథలు తారసపడకపోవడంతో ఆయన చాలాకాలం ఖాళీగా ఉండిపోవలసి వచ్చింది. "కథలు లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరీయర్" అని దట్స్ తెలుగు ఏడాది క్రితం ఒక కథనం ప్రచురించింది.
మంచి కథలు వింటున్న ఎన్టీఆర్ 2010 నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ తర్వాత దిల్ రాజు చిత్రం "బృందావనం"లో ఆయన నటిస్తున్నారు. కొన్ని రోజులు ఆయన ఈ రెండు చిత్రాల్లోను నటించేలా స్కెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. అశ్వనీదత్ నిర్మాణంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో "శక్తి" సినిమా షూటింగ్ లో ఆయన వచ్చే ఏడాది పాల్గొంటారు.
ఇతర యువ హీరోలకు కూడా కథలు, కాంబినేషన్లు త్వరత్వరగా కుదురుతున్నాయి. అల్లు అర్జున్ రెండు మూడు చిత్రాలను ఇప్పటికే ఒప్పుకుని డేట్స్ సర్దుబాటు చేసుకుంటున్నారు. కథలు నచ్చక మహేష్ బాబు సినిమాలు ఒప్పుకోకపోవడం వల్ల రెండేళ్ళుగా ఆయన సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు మహేష్ కూడా శరవేగంగా కథలు వింటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











