‘బిజినెస్ మ్యాన్’ సినిమాపై చర్యలు?
మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'బిజినెస్ మేన్' సినిమాలోని 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' పాట వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ పాట హిందువుల మనోభావాలను కించ పరిచే విధంగా, సంస్కృతిని అవమాన పరిచే విధంగా ఉందని ఇప్పటికే భజరంగ్ దళ్ కార్యకర్తలు సికింద్రబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై పోలీసులు పబ్లిక్ ప్యాసిక్యూటర్ సలహా కోరగా.... సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం 295A సెక్షన్ కింద ఆ సినిమా దర్శకుడు, రచయిత, ఇతరులపై చర్యలు తీసుకోవచ్చని సూచించారు. దీంతో ఈ కేసు వివాదం ఎక్కడి వరకు వెలుతుందో? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు, కాజల్ జంటగా నటించారు. వివాదాస్పదమైన 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' పాటలో బాలీవుడ్ భామ శ్వేత భరద్వాజ్ విపరీతంగా అందాలు ఆరబోస్తూ అశ్లీల నృత్యం చేసింది. దీంతో సెన్సా బోర్డు వారు సదరు అశ్లీల సీన్లు కనిపించకుండా చేయాలని ఆదేశించడంతో అవి కనిపించకుండా పాటను ప్రదర్శిస్తున్నారు. ఇక సినిమాలో ప్రయోగించిన బండబూతులు కూడా వినిపించకుండా కత్తెర వేశారు.
వినోదం మాట అటుంచితే...ఒక స్టార్ హీరో, యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మహేష్ బాబు సినిమాలో ఇలాంటి చండాలం ఏమిటి? అంటూ మహిళా సంఘాలు, భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











